అమరావతి:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరగాలన్న ఉద్దేశ్యం విపక్షానికి  లేకుండా పోయిందని జగన్ విమర్శించారు.

బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో  సంక్షేమ పథకాలపై చర్చ సందర్భంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం సాగింది.టీడీపీ విమర్శలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షనేత చంద్రబాబుకు మైక్ ఇవ్వాలని  టీడీపీ సభ్యులు పదే పదే సభలో నినాదాలు చేయడంతో ఏపీ సీఎం జగన్ స్పందించారు.

ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని  ప్రతిపక్ష టీడీపీ చేస్తోందని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న తమ ప్రభుత్వాన్ని విపక్షం అభినందించాల్సింది పోయి సభా కార్యక్రమాలకు అడ్డుపడడం సరైంది కాదని ఏపీ సీఎం జగన్  అభిప్రాయపడ్డారు.

ఎన్నికల మేనిఫెస్టోలో  పొందుపర్చిన అంశాలను  అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని జగన్ వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావిస్తున్నందునే   మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తున్నట్టుగా జగన్ ప్రకటించారు.

తాను సమాధానం ఇచ్చిన తర్వాత కూడ పదే పదే మాట్లాడుతానని విపక్షనేత  చంద్రబాబు మైక్ అడుగుతున్నారని, ఇదే పద్దతి కొనసాగితే సభా కార్యక్రమాలు కొనసాగవని  జగన్  అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల వాకౌట్