పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకొన్నారు: చంద్రబాబు

Ap Chief minister Chandrababunaidu Slams on Pawan Kalyan
Highlights

విపక్షాలపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

అమలాపురం: తాను చెప్పడం వల్లే వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించలేదని ఆ పార్టీ ఎంపీలు చెప్పడం హస్యాస్పదంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.  2019  ఎన్నికల్లో  కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాదన్నారు. ఏపీకి న్యాయం చేసే ప్రభుత్వమే అధికారంలోకి వస్తోందని చంద్రబాబునాయుడు ధీమాను వ్యక్తం చేశారు.వపన్ కళ్యాణ్ యూ టర్న్  తీసుకొని తనపై విమర్శలు గుప్పిస్తున్నారని బాబు  చెప్పారు.


తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మంగళవారం నాడు జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. 2015 నుండి  వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తామని  చెబుతూనే ఉన్నారని ఆయన విమర్శించారు. ప్రతి ఏటా  రాజీనామాలను వాయిదా వేసుకొంటూ వచ్చారని చెప్పారు. తాను చెబితే వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించకుండా ఉంచారని  చెప్పడంహస్యాస్పదమన్నారు. తాను చెబితే కేంద్రం వింటే ప్రత్యేక హోదా రాష్ట్రానికి వచ్చేదన్నారు. అంతేకాదు విభజన బిల్లులోని హమీలను అమలు చేసుకొనేవారమన్నారు. 

 వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ఆయన చెప్పారు.  చిత్తశుద్ది ఉంటే  రాజీనామాలను ఆమోదించుకోవాలని ఆయన వైసీపీ ఎంపీలకు సూచించారు.  ఇంతకుముందే  రాజీనామాలను ఆమోదించుకొంటే ఉప ఎన్నికలు వచ్చేవన్నారు. ఉప ఎన్నికలు వస్తే చిత్తు చిత్తుగా ఓడించేవారమన్నారు. ఉప ఎన్నికలు రావనే ఉద్దేశ్యంతోనే  రాజీనామా డ్రామాలను వైసీపీ  ఎంపీలు ఆడుతున్నారని ఆయన చెప్పారు.


బిజెపి నమ్మించి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేస్తే, ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేసిందని చంద్రబాబునాయుడు విమర్శించారు. 

రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. బిజెపితో వైసీపీ లాలూచీ పడిందన్నారు. ఎవరు కుట్రలు పన్నినా ఆ కుట్రలను  వదిలిపెట్టే  ప్రసక్తేలేదన్నారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకొని  తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో చేసిన అభివృద్ది పవన్ కు కన్పించడం లేదా  అని ఆయన ప్రశ్నించారు.కాపుల రిజర్వేషన్లపై తమ చిత్తశుద్దిని ఎవరూ కూడ శంకించలేరన్నారు.. బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టుమరోసారి  బాబు చెప్పారు. 

 రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో కేంద్రంపై పోరాటం చేయకుండా కొన్ని పార్టీలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. నాపై బురద చల్లేందుకు ప్రయత్నాలు
చేస్తున్నారన్నారు. తనపై బురద చల్లితే వారికే బురద అంటుతోందని బాబు  చెప్పారు.

ఏపీకి నష్టం చేసేలా కుట్రకు పాల్పడిన బిజెపితో పాటు ఆ పార్టీతో కలిసే పార్టీలను ఈ వ్యవహరంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా  భాగస్వామ్యం ఉన్న పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలని  చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు.

  
పంట రుణం తీసుకొన్న రైతులకు ఒక్కొక్కరికి సుమారు రూ. లక్షన్నర అప్పును మాఫీ చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలోని సుమారు రూ.24వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని ఆయన గుర్తు చేశారు. రుణ మాపీ చేసి రైతుల రుణం తీర్చుకొన్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు.రాష్ట్రంలో పేదలకు  సుమారు 19 లక్షల ఇళ్ళను నిర్మిస్తున్నట్టు చెప్పారు.సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు. పేదలకు ఆదాయం పెంచే మార్గాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

loader