ఏలూరు:  ఎస్వీఆర్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి ఆయన జీవిత చరిత్ర అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఇద్దరూ కూడ మంచి స్నేహితులని ఆయన గుర్తు చేశారు.

మంగళవారం నాడు పశ్చిమగోదావరి జిల్లా కలపర్రులో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎస్వీరంగారావు శతజయంత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్, ఎస్వీరంగారావు కాంబినేషన్‌లో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయన్నారు. ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ చిత్రసీమల్లో తిరుగులేని క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా  ఎస్వీఆర్ పేరు గండించారన్నారని బాబు కొనియాడారు.

విగ్రహాం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఎస్వీఆర్ జంక్షన్‌గా పేరు మారుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమ పేరును విశ్వవ్యాప్తం చేసేలా ఎస్వీరంగారావు కృషి చేశారని సీఎం గుర్తు చేసుకొన్నారు.

తెలుగు సినీ పరిశ్రమకు ఎస్వీఆర్ చేసిన సేవలు మరువలేనివన్నారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఇద్దరూ కూడ మంచి స్నేహితులని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఎస్వీఆర్ మ్యూజియంతో పాటు  రిసార్ట్స్ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దనున్నట్టు ఎస్వీఆర్ ప్రకటించారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ జిల్లాకు ఎంత చేసినా తక్కువ చేసినట్టేనని ఆయన చెప్పారు.  ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకొంటానని బాబు ప్రకటించారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఏం కోరుకొంటే వాటిని మంజూరు చేస్తానని ఆయన హమీ ఇచ్చారు.

అమరావతి తర్వాత ఏలూరులో  రెండో టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.  సంక్షేమ పథకాల విషయంలో దళారుల జోక్యం లేకుండా చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకొంటున్న విషయాన్ని బాబు గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 14 లక్షల ఇళ్లు కట్టించినట్టు లెక్కలు చెబుతున్నా... ఆ ఇళ్లు మాత్రం కాగితాలకే పరిమితమైనట్టు ఆయన చెప్పారు.  అయితే పేదలకు స్వంత ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతోనే రూ.3 లక్షలను ఖర్చు చేసి గృహ నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.