అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలు వెల్లడికి ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో అభ్యర్థులే కాదు అటు ప్రజల్లోనూ నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు. 

మెుదటి ఫలితం ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పుడు ఫలితం వెలువడుతుందా అన్న ఉత్కంఠకు తెరదించారు సిఈవో గోపాలకృష్ణ ద్వివేది. మధ్యాహ్నాం 2గంటలకు ఈవీఎంల కౌంటింగ్ పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. 

టేబుళ్లు, ఓట్లను బట్టి ఫలితం వెలువడుతుందని స్పష్టం చేశారు. ఈనెల 23న జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. ఫలితాలు తొందరగా ఇవ్వడం కాదని, కరెక్ట్‌గా ఇవ్వడమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు సిఈవో గోపాలకృష్ణ ద్వివేది. 

కౌంటింగ్‌ రోజు ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రశాంతంగా కౌంటింగ్‌ జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విఙ్ఞప్తి చేశారు. ఇకపోతే ఈవీఎంలకు మూడు సీల్స్ ఉంటాయని, ఏజెంట్ల సమక్షంలోనే సీల్ ఓపెన్ చేస్తామని ప్రకటించారు. 

ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ వస్తున్న అనుమానాలకు అవకాశమే లేదన్నారు. ఎన్నికల ప్రక్రియలో చీటింగ్ అసాధ్యం అని తేల్చి చెప్పారు. కౌంటింగ్ ప్ రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రంలో అవకతవకలకు పాల్పడినా, గొడవలు సృష్టించినా ఎవరినీ ఉపేక్షించేది లేదని సిఈవో గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు.