అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేబినెట్ లో కీలక మంత్రి పదవి దక్కించుకున్నారు మేకతోటి సుచరిత. నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి హోంశాఖ మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. 

దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం ఇస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న వైయస్ జగన్ హోంశాఖను మహిళా ఎమ్మెల్యేకు కట్టబెట్టడం మరో సంచలనంగా చెప్పుకోవచ్చు. 

జగన్ కేబినెట్ లో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులను కట్టబెట్టి వారిలో ఒకరికి ఉపముఖ్యమంత్రి, మరోకరికి హోంశాఖ కట్టబెట్టి మహిళల పక్షపాతిగా నిరూపించుకున్నారు వైయస్ జగన్. మహిళా ఎమ్మెల్యేకు హోంశాఖ కట్టబెట్టడంలో తన తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నారు. 

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009లో ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ పదవి ఇచ్చారు. అదేకోవలో పయనించిన వైయస్ జగన్ తండ్రికంటే ఒక అడుగు ముందుకు వేసి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యేకు కీలకమైన హోంశాఖ కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

ఇకపోతే మేకతోటి సుచరితను రాజకీయాల్లోకి ఆహ్వానించింది దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి. 2009 ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి మేకతోటి సుచరితకు అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా గెలుపొందారు. 

వైయస్ఆర్ మరణానంతరం ఆమె వైయస్ జగన్ వెంట నడిచారు. కాంగ్రెస్ పార్టీతో విబేధించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడంతో ఆమె వైసీపీలో చేరిపోయారు. దీంతో ఆమెపై కాంగ్రెస్ పార్టీ అనర్హత వేటు వేసింది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. 

అయితే 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. మాజీమంత్రి రావెల కిశోర్ బాబు చేతిలో పరాజయం పాలయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ పై విజయం సాధించారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపట్ల విధేయత, వైయస్ జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండటం వంటి పరిణామాలు ఆమెకు కలిసొచ్చిందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ నవ్యాంధ్రప్రదేశ్ లో తొలి మహిళా హోంశాఖ మంత్రిగా రికార్డు సృష్టించబోతున్నారు మేకతోటి సుచరిత.