ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం: సమావేశం తర్వాత మంత్రుల రాజీనామాలు
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతుంది. మంత్రులకు ఇదే చివరి సమావేశం. దీంతో ఈ సమావేశానికి మంత్రుల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
అమరావతి:ఏపీ సీఎం YS Jagan అధ్యక్షతన గురువారం నాడు సచివాలయంలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో మెజారిటీ మంత్రులకు ఇదే చివరి Cabinet సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత సీఎం ఆదేశాల మేరకు కొందరు మంత్రులు Resignations చేయనున్నారు. ఈ నెల 11న సీఎం జగన్ మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరించనున్నారు. రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలకు పార్టీని సంసిద్దం చేసేందుకు గాను YCPని పటిష్టం చేసేందుకు కొందరు మంత్రులను మంత్రివర్గం నుండి తప్పించి పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారు.
2019లో జగన్ తన మంత్రివర్గం ఏర్పాటు చేసే సమయంలో ప్రస్తుతం ఉన్న మంత్రులను రెండున్నర ఏళ్లపాటు కొనసాగిస్తానని ప్రకటించారు. రెండున్నర ఏళ్ల తర్వాత కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకొంటానని ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గం కూర్పు చేయనున్నారు. అయితే ఐదు డిప్యూటీ సీఎంలు కూడా కొనసాగనున్నారు. అదే సమయంలో కొత్త జిల్లాలకు కూడా ప్రాధాన్యత దక్కనుంది.
గత మాసంలో నిర్వహించిన వైసీపీ శాసనసభపక్షం సమావేశంలో మంత్రివర్గం పునర్వవ్యస్థీకరణ గురించి కూడా జగన్ ప్రకటించారు.గత మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ విషయమై మంత్రులతో కొంతసేపు సీఎం జగన్ చర్చించారు. అయితే కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు, ప్రస్తుతం ఉన్న వారిలో ఇంకా మంత్రివర్గంలో ఎవరు కొనసాగుతారనే విషయమై మంత్రుల్లో ఉత్కంఠ నెలకొంది.ప్రస్తుత మంత్రులు మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడానికి ముందే తమ ఛాంబర్లలో ఫైల్స్ క్లియర్ చేశారు.
కేబినెట్ సమావేశం తర్వాత కేబినెట్ నుండి ఉద్వాసనకు గురయ్యే మంత్రుల నుండి సీఎం జగన్ రాజీనామాలు తీసుకోనున్నారు.ఈ రాజీనామాలను జీఏడీ గవర్నర్ కార్యాలయానికి పంపనుంది. ఈ నెల 6వ తేదీనే సీఎం జగన్ గవర్నర్ మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ గురించి సమాచారం ఇచ్చారు.
అయితే ఇవాళ మంత్రివర్గం నుండి తప్పుకోనున్న మంత్రులకు ప్రోటోకాల్ ఇబ్బందులు కలగకుంగా ఉండేందుకు గాను కొన్ని కీలక నిర్ణయాలను సీఎం జగన్ తీసుకొనే అవకాశం ఉంది. పనితీరు ఆధారంగా మంత్రివర్గం నుండి కొందరిని తప్పించనున్నారు. మరికొందరిని పార్టీ అవసరాల రీత్యా మంత్రి వర్గం నుండి తప్పించనున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ అవసరాల రీత్యా పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన నేతల సేవలను వినియోగించుకోనున్నారు.
ఇవాళ కేబినెట్ సమావేశం తర్వాత సుమారు 20 నుండి 23 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించే అవకాశం ఉంది. ఇవాళ కేబినెట్ సమావేశంలో36 అంశాలపై చర్చించనున్నారు. కొత్త రెవిన్యూ డివిజన్లకు ఆమోదం తెలపడంతో పాటు ఇతర అంశాలపై కేబినెట్ ఆమోదం తెలపనుంది.
మంత్రివర్గ సమావేశానికి మంత్రులు తమ లెటర్ హెడ్ లతో వెళ్లారు. రాజీనామాలు సమర్పించేందుకు మంత్రులు లెటర్ హెడ్ లను ఉపయోగించనున్నారు. కేబినెట్ సమావేశానికి ముందుగా మంత్రులు సచివాలయంలోనే భోజనం చేశారు. మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పేర్ని నాని, కొడాలి నానిలు ఈ సందర్భంగా సరదాగా మాట్లాడుకున్నారు.