అమరావతి: ఏపి మంత్రివర్గ విస్తరణపై గతకొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. బుధవారం ఆంధ్ర ప్రదేశ్ రాజ్ భవన్ లో గవర్నర్ హరిచందన్ విశ్వభూషన్ కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గోనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కూడా ఖరారయ్యింది. రేపు మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనే సీఎం షెడ్యూల్ ను ఏపి ప్రభుత్వం ప్రకటించింది. 

బుధవారం మద్యాహ్నం 12.50గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి రోడ్డుమార్గాన సీఎం జగన్ బయలుదేరి ఒంటిగంట  వరకు రాజ్ భవన్ కు చేరుకుంటారు. 1-2గంటల వరకు జరిగే మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాజ్ భవన్ నుండి తిరిగి నేరుగా క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రత, ఇతరత్ర ఏర్పాట్లను చూడాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఎమ్మెల్సీ కోటాలో మంత్రిపదవులను పొందిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వారు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో మంత్రివర్గ విస్తరణ అనివార్యమయ్యింది. వారిద్దరి స్థానాల్లో మరో ఇద్దరిని మంత్రిమండలిలోకి తీసుకోవాలని జగన్ నిర్ణయించారు. కొత్త మంత్రుల చేత గవర్నర్ రేపు ప్రమాణస్వీకారం చేయించనున్నారు. 

read more  జగన్ మంత్రివర్గ విస్తరణ: అవకాశం వీరికే, కారణాలివే...

అయితే ఈ మంత్రివర్గ విస్తరణపై ఎన్నెన్నో ఊహాగానాలు వినబడుతున్నాయి. మంత్రివర్గంలోకి ఎవరినీ తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.   ఘడియ గడియకు సమీకరణాలను చూసుకోవడం వాటిని సమీక్షించడం అన్ని జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకసారి వినబడ్డ పేరు మరల  వినబడడం లేదు. రేసులో లేనిపేర్లు అనూహ్యంగా ముందుకు వస్తున్నాయి. 

బోస్ ను గనుక తీసుకుంటే... ఆయన మంత్రిగా సేవలందించడంతోపాటుగా ఆయన ఉపముఖ్యమంత్రి కూడా. ఒకవేళ మంత్రిగా ఎవరినైనా తీసుకున్నప్పటికీ వారిని నేరుగా ఉపముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టలేరు. ఇతర సీనియర్ బీసీ నేతలు చాలా మంది ఉన్నారు. 

మోపిదేవి మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు కాగా, పిల్లి శెట్టిబలిజ సామజిక వర్గానికి చెందినవారు.  తొలుత మత్స్యకార వర్గం నుంచి నుంచి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ను అనుకున్నప్పటికీ.... ఆ సామాజికవర్గానికి ఆ ప్రాంతంలో కన్నా ఉత్తరాంధ్రలో ఇవ్వడం కరెక్ట్ అని జగన్ భావించారు. 

ఉత్తరాంధ్రలో ఇప్పటికే బొత్స, ధర్మాన ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ అక్కడ రాజకీయ సమీకరణాల దృష్ట్యా పలాస ఎమ్మెల్యే అప్పలరాజుకు అమాత్య పదవిని కట్టబెట్టనున్నట్టు తెలియవస్తుంది. 

అదే విధంగా బోస్‌ సామాజిక వర్గాన్నీ అదే సామాజికవర్గంతో నింపాలని ప్రయత్నించినప్పుడు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పేరు వినబడ్డప్పటికీ.... తూర్పు గోదావరి జిల్లారాజకీయ సమీకరణాల దృష్ట్యా రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణకె అమాత్య పదవి దక్కినట్టుగా సమాచారం. 

ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తమ్మినేని, జోగి రమేష్ సహా ఇతర మంత్రి పదవులు ఆశించిన వారికి నిరాశే ఎదురయింది. డిప్యూటీ సీఎం గా ధర్మాన కృష్ణ దాసును ప్రమోట్ చేసే ఆస్కారం ఉన్నట్టు చెబుతున్నారు. ధర్మానకు ఉప ముఖ్యమంత్రిపదవితోపాటు పిల్లి నిర్వర్తించిన రెవిన్యూ శాఖను కూడా అప్పగించాలని భావిస్తున్నారు.