వైజాగ్ లో టెక్ పార్క్ కు 60 ఎకరాలు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏపీ కేబినెటె్ సమావేశం బుధవారం నాడు అమరావతిలో జరిగింది. పవన, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతి:రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పవన్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ కేబినెట్ బుధవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరిగింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులకు కెబినెట్ ఆమోదం తెలిపింది.
1000 మెగావాట్ల పవన విద్యుత్ , 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లుఏర్పాటు చేయాలని ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. నాలుగు విడతల్లో రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది ఈ సంస్థ . పవన, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులతో సుమారు 2 వేల మందికి ఉపాధి కలగనుంది. వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు కూడ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద కొత్తగా ఎనర్జీ పార్కు ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి తో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది కేబినెట్ . రూ.1,10,000 కోట్ల పెట్టుబడి తో ఎన్టీపిసి ప్రాజెక్టు కు జగన్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి విడతలో 30 వేలు, రెండో విడతలో 31వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. రాష్ట్రంలో గల యూనివర్శిటీల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది.
వైజాగ్ టెక్ పార్కుకు 60 ఎకరాలను కేటాయిస్తూ జగన్ కేబినెట్ అంగీకరించింది. వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదించింది. బందరు పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. 9.75 శాతం వడ్డీతో రూ. 3940 కోట్ల రుణం తీసుకోనుంది సర్కార్.
నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చేందుకు కెబినెట్ అంగీకరించింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు కెబినెట్ అంగీకారం తెలిపారు. యూనిట్టుకు రూ. 2 చొప్పున రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.