కాపులకు 5 శాతం రిజర్వేషన్…నేడు అసెంబ్లీలో చర్చ ?

AP cabinet approves 5 percent reservation for kapus
Highlights

  • కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది

కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. జస్టిస్ మంజూనాధ కమీషన్ ఇచ్చిన నివేదికపై శుక్రవారం జరిగిన మంత్రివర్గం చర్చించింది. కాపు దాని ఉపకులాలైన ఒంటరి, బలిజ తదితరాలకు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదించింది. మంజూనాధ కమీషన్ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శనివారం నాడు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నివేదికను, మంత్రివర్గం నిర్ణయాన్ని సభ ఏకగ్రవంగా ఆమోదించిన తర్వాత అమలు కోసం కేంద్రానికి పంపుతారు.

పోయిన ఎన్నికల్లో లబ్దిపొందాలన్న ఉద్దేశ్యంతో ఆచరణ సాధ్యం కాని హామీలు చంద్రబాబు చాలా చేసారు. అటువంటిల్లో కాపులను బిసిల్లో చేర్చటం కూడా ఒకటి. అయితే, హామీ ఇచ్చినంత తేలిక కాదు అమలు చేయటమన్నది. అందుకే అధికారంలోకి రాగానే తానిచ్చిన హామీని చంద్రబాబు గాలికొదిలేశారు. అయితే, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎప్పుడైతే రోడ్డెక్కారో కాపులు ఉద్యమానికి అండగా నిలిచారు. దాంతో చంద్రబాబు ఇరుకునపడ్డారు. అందులో నుండి బయటపడేందుకు జస్టిస్ మంజూనాధ కమీషన్ వేసి చేతులు దులుపేసుకున్నారు.

సరే, మళ్ళీ ఎన్నికలొస్తున్నాయి కదా? పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారబోతోంది. అందుకనే హడావుడిగా కమీషన్ నివేదికను మంత్రివర్గం ముందు పెట్టి ఆమోదింపచేసుకున్నారు. ఈరోజు అసెంబ్లీలో చర్చిస్తారు. కాపులకు రిజర్వేషన్ వర్తింప చేయాలని కోరుతూ ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపేస్తారు. అప్పుడు తీర్మానాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రానిదవుతుంది. మళ్ళీ వచ్చే ఎన్నికలకు చంద్రబాబు ఎంచక్కా అదే హామీపై ఓట్లడగవచ్చు. పోయిన ఎన్నికల్లో తానిచ్చిన హామీని తాను నెరవేర్చుకున్నానని చెబుతారు. ఇక, అమలు చేయాల్సింది కేంద్రమేనని, తాన చేతుల్లో ఏమీ లేదంటారు.  

అంటే, కాపులకు రిజర్వేషన్ హామీ ఇచ్చి లబ్దింపొందిందేమో చంద్రబాబునాయుడు. చంద్రబాబిచ్చిన హామీని అమలు చేయాల్సిందేమో కేంద్రప్రభుత్వం. ఎలాగుంది చంద్రబాబు గారి ఐడియా. ఒకవేళ రిజర్వేషన్ అమలు కాకపోతే ఆ తప్పు కేంద్రానిది అవుతుందే కానీ చంద్రబాబుది ఎంత మాత్రం కాదన్న మాట. పోయిన ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు చంద్రబాబు ఈ తతంగాన్నంతా ఎక్కడా చెప్పలేదు. పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు విషయమేదైనా కేంద్రం-చంద్రబాబు మధ్య సఖ్యత అంతగా బావోలేదు. ఇటువంటి పరిస్దితుల్లో వచ్చే ఎన్నికలకు ఒంటిరిగా వెళ్ళటానికి చంద్రబాబు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు కనబడుతోంది. అందులో భాగమే పోలవరం నిర్మాణం, కాపులకు రిజర్వేషన్ వర్తింపచేసే బాధ్యతను కేంద్రంపై నెట్టేస్తున్నారు.

 

loader