మరో 48 గంటల్లో మొదలవనున్న సమావేశాలు ఏ విధంగా జరుగుతాయనేందుకు ఇవి సంకేతాలుగా అనుకోవచ్చు.
అసెంబ్లీ సమావేశాలకు అధికార పార్టీ వైసీపీకి కేసులతో స్వాగతం పలుకుతోంది. 3వ తేదీ నుండి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వెలగపూడిలో మొదలవుతున్నాయి. నూతన అసెంబ్లీ భవనంలో మొదలయ్యే సమావేశాలైనా అర్ధవంతంగా జరుగాలని అందరూ కోరుకుంటున్నారు. అదే విషయాన్ని ప్రతిపక్ష సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. అయితే, సమావేశాలు జరిగే తీరుతెన్నులకు ముందస్తు హెచ్చరికాల్లాంటి ఘటనలు జరగటం గమనార్హం.
పెనుగంచిప్రోలు మండలం ముళ్ళపాడులో జరిగిన బస్సు ప్రమాదం తదనంతర ఘటనలపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసింది. అంతుకుముందు గన్నవరం విమానాశ్రయంలో రోజా అరెస్టు వ్యవహారం కూడా చెప్పుకోదగ్గదే. విధినిర్వహణలో ఉన్న వైద్యులను ఆటంకపరచినట్లు జగన్ పై ఆసుపత్రి అభివృద్ధి కమిటితో ప్రభుత్వం కేసు పెట్టించింది. అదిపుడు పెద్ద వివాదమవుతోంది.
అంతుకుముందు విజయవాడ సమీపంలో జరిగిన అంతర్జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ ఎంఎల్ఏ రోజాను పోలీసులు అరెస్టు చేసారు. సదస్సులో పాల్గొనేందుకు స్పీకర్ ఆహ్వానం పంపారు. దాంతో రోజా విజయవాడ చేరుకోగానే పోలీసులు అరెస్టు చేసి మళ్ళీ హైదరాబాద్ కు తరలించటం పెద్ద వివాదమైంది. రోజా వివాదంలో ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులు పడుతుండగా, ముళ్ళపాడు ఘటనలో జగన్ వైఖరితో వైసీపీ ఇబ్బందుల్లో పడింది.
3వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండగా, 1వ తేదీన జగన్ పై క్రిమినల్ కేసు నమోదవ్వటం గమనార్హం. జగన్ వైఖరిపై చంద్రబాబునాయుడుతో సహా టిడిపి నేతలందరూ విరుచుకుపడుతున్నారు. మరో 48 గంటల్లో మొదలవనున్న సమావేశాలు ఏ విధంగా జరుగుతాయనేందుకు ఇవి సంకేతాలుగా అనుకోవచ్చు. ఎందుకంటే, జగన్, రోజా వ్యవహారాలను వైసీపీ లేవనెత్తుతుంది. అంతకుముందు విశాఖపట్నం విమానాశ్రయంరన్వే పైనే జగన్ను పోలీసులు అనధికారికంగా నిర్బంధించిన వ్యవహారం ఎటూ ఉండనే ఉంది.
