అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ జాతీయ నాయకత్వం సయోధ్యకు సై అంటుంటే ఏపీ బీజేపీ మాత్రం నై అంటోంది. స్నేహాం ఎలా ఉన్న అందివచ్చిన ప్రతీ అంశాన్ని ఆసరాగా చేసుకుని కయ్యానికి కాలు దువ్వుతోంది. 

తాజాగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కయ్యానికి కాలు దువ్వింది ఏపీ బీజేపీ. అమెరికా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం వైయస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేయడానికి నిరకరించారని ఆరోపిస్తోంది. జగన్ వ్యవహారశైలి హిందువుల మనోభవాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

 

హిందువుల ఓట్లు కోసమే జగన్ దేవాలయాల చుట్టూ తిరుగుతారంటూ మండిపడింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంచి స్క్రిప్ట్ రాశారంటూ సెటైర్లు వేసింది. ప్రశాంత్ కిశోర్ వ్యూహాలను పశ్చిమబెంగాల్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుందంటూ పంచ్ లు వేసింది. చివరిగా యాంటీ హిందు జగన్ అంటూ హ్యాష్ ట్యాగ్ సైతం ఇచ్చింది. 

ఇదే అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సైతం స్పందించారు. అమెరికాలో ఒక కార్యక్రమంలో జ్యోతిప్రజ్వలన చేసేందుకు జగన్ నిరాకరించారని ఆరోపించారు. జగన్ చర్య హిందువులను అవమానించడమేనని తన ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 

ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసమే జగన్ దేవాలయాల చుట్టూ తిరుగుతూ నటించారని దీన్ని బట్టి అర్థమవుతుందని సీఎం రమేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చివర యాంటి హిందు జగన్ అంటూ హ్యాష్ ట్యాగ్ సైతం ఇచ్చారు సీఎం రమేష్.