జాతీయ ప్రాజెక్టు పోలవరం... రాష్ట్ర ప్రభుత్వం చేతులలో నుంచి  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లనుందా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.  ఇలా చేయడానికి బీజేపీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో... పోలవరం పై చేసిన కామెంట్లను ఇప్పుడు బీజేపీ నేతలు అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ ప్రతిపక్షగా ఉన్న సమయంలో.. కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం తీసుకుందని ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రకారం దీనికి కేంద్రమే నిర్మించాల్సి ఉందని కూడా అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు.

అప్పుడు జగన్ చేసిన కామెంట్స్ ని ఇప్పుడు బీజేపీ తమకు ఆయుధాలుగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ప్రాజెక్టు ప్రాంతంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి.. ఈ నెల 13న (ఆదివారం) ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి షెకావత్‌ను కలసి మెమోరాండం సమర్పించనుంది.
 
ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని అందులో అభ్యర్థించనున్నారు. ఇందుకు గతంలో కేంద్రానికి జగన్‌ రాసిన లేఖలు, రాజ్యసభలో వైసీసీ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రసంగాలను ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. రాష్ట్ర బీజేపీ డిమాండ్‌పై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 

ఇంకోవైపు.. పోలవరం జలవిద్యుత్కేంద్రం పనుల నుంచి తనను తప్పించడాన్ని సవాల్‌ చేస్తూ నవయుగ ఇంజనీరింగ్‌ సంస్థ దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. తీర్పు రిజర్వులో ఉండడానే.. ఈనెల 16న హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశం ఏర్పాటుచేసింది.

 కాగా... పోలవరం ప్రాజెక్టును తమ చేతుల్లోకి తీసుకొని... దానిని పూర్తి చేసిన ఘనత బీజేపీకే దక్కేలా చేయాలనేది ఆ పార్టీ పెద్దల ఆలోచన అన్నట్లు తెలుస్తోంది. పోలవరం పూర్తి చేసిన ఘనత దక్కించుకొని... దాని ద్వారా ఎన్నికలకు వెళ్లి.. ఏపీలో అధికారం పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలని చూస్తున్నట్లు సమాచారం.