కేంద్రంతో రాష్ట్రాలకు అవగాహన లేకపోవడంతోనే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని సోము వీర్రాజు పేర్కొన్నారు.
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు ధరలపై ఆలోచించాలని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సూచించారు. కేంద్రంతో రాష్ట్రాలకు అవగాహన లేకపోవడంతోనే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. పెట్రోల్ ను జిఎస్ టి పరిధిలోకి తీసుకురావాలని తామే ప్రతిపాదించామని... కానీ దానికి రాష్ట్రాలు అంగీకరించలేదన్నారు. పెట్రోల్ పై విధించే సెస్ ను రాష్ట్రాలు తగ్గించుకోవాలని... ఇప్పటికే పక్కనున్న తెలంగాణా, మధ్య ప్రదేశ్ లో ప్రభుత్వాలు సెస్ ను తగ్గించాయన్నారు. ఆ దిశగా అన్ని రాష్ట్రాలు కూడా ఆలోచించాలని వీర్రాజు కోరారు.
వైసిపి, టిడిపిలు ఓ బిసిని ముఖ్యమంత్రి చేయగలవా? అని మాత్రమే తాను ప్రశ్నించానని... తాము గెలిస్తే బిసిని సీఎం చేస్తానని అనలేదని వీర్రాజు వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి గురించి ప్రకటన చేసే అధికారం తనకు లేదని...బిజెపిలో జెపి నడ్డా, మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లు చర్చించి ముఖ్యమంత్రి పై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. బిసి అయిన మోడీని ప్రధానిని చేసింది బిజెపి అని గుర్తించాలన్నారు.
read more పవన్ కల్యాణ్ సెగ: బీసీ సిఎం ప్రకటనపై సోము వీర్రాజు యూటర్న్
ఓటు బ్యాంకు లేనప్పుడు మా పార్టీ గురించి మాట్లాడకూడదు కదా... ఎందుకు భయపడుతున్నారు అని అడిగారు. నోటా పార్టీ అంటూ నోరు జారకండి... జాగ్రత్త గా ఉండండి అని హెచ్చరించారు. ఈ నోటా పార్టీ తరపునే ఇప్పటి మంత్రి వెలంపల్లి పోటీ చేసి 3వేల ఓట్లతోనే ఓడిపోయారని గుర్తుచేశారు. బిజెపి సకల జనుల పార్టీ.. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని వీర్రాజు వెల్లడించారు.
దేవాలయ నిధులను వాడేసిన చంద్రబాబు ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నాడని విమర్శించారు. ఇక సిపిఐని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించిందన్నారు. విశాఖ ఉక్కుపై ఈ నెల 14న ఢిల్లీ వెళ్ళి జాతీయ కమిటీని కలిసి విన్నవిస్తామన్నారు. ఎంపీ జివియల్, ఎమ్మెల్సీ మాధవ్ తో కలిసి వెళ్లి ఉక్కు శాఖ మంత్రిని కలుస్తామన్నారు. దేశంలోని అన్ని ఫ్యాక్టరీలపైన విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని.. అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం తీసుకున్నారని వీర్రాజు అన్నారు.
