అమరావతి: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకిపారేశారు. ఇరువురిని ఒకే గాటన కట్టి ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టుపై తమ బిజెపి స్పష్టంగా ఉందని ఆయన సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. 

దార్శనికుడైన నారా చంద్రబాబు నాయుడు 1800 రోజుల్లో ఏం చేశారని ఆయన ప్ఱశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ ప్రభుత్వం సహకరించడం లేదని, గత చంద్రబాబు ప్రభుత్వం కూడా సహకరించలేదని ఆయన విమర్శించారు. అమరావతి అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. రెండేళ్లలో ఇక్కడే సొంత పార్టీ కార్యాలయం ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. 

అమరావతిలో తొమ్మిది వేల ఎకరాలను చంద్రబాబు అభివృద్ధి చేయాల్సి ఉన్నా చేయలేదని ఆయన విమర్శించారు. అమరావతిలో 64 వేల ప్లాట్లు రైతులకు ఇవ్వాలని, 9 వేల ఎకరాలను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. ఎయిమ్స్ ను తక్కువ ఖర్చుతో కేంద్రం నిర్మించి చూపించిందని ఆయన అన్నారు. ఆనాటి, ఈనాటి ప్రభుత్వాలు కనీసం రోడ్డుకు స్థలం కూడా ఇవ్వలేదని అన్నారు. 

రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీలు ప్రజలను మోసం చేశాయని ఆయన అన్నారు. వైసీపీ నమ్మించి మోసం చేసిందని అన్నారు. హైకోర్టు రాయలసీమలో ఉండాలనే తమ విధానానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రాజధానికి కేంద్రం కేటాయించిన నిధుల లెక్కలను చెప్పాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం కూడా గొప్పలు చెప్పుకోవడం తప్ప చేతల్లో చూపించడం లేదని అన్నారు. 

గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గడ్కరీ స్వయంగా చంద్రబాబును విశాఖ పిలిచి నిధులపై చర్చించినట్లు ఆయన తెలిపారు. అన్ని పార్టీల జాతకాలు చెప్పే లగడపాటి రాజగోపాల్ రెండేళ్లలో ఎంపీగా దుర్గగుడి  ఫ్లైఓవర్ నిర్మాణం చేయలేకపోయారని ఆయన అన్నారు. కేశినేని నాని ఒక్క లేఖ రాయగానే స్పందించి గడ్కరీ నిధులు ఇచ్చారని ఆయన చెప్పారు. 

అవినీతి విషయంలో వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు సమానమేనని ఆయన అన్నారు. సెంటు స్థలం పేరుతో స్థలాల పంపిణీ ఇంటూ కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశారని ఆయన విమర్శించారు. టీడీపీ, వైసీపీలు కుటుంబ పార్టీలని, బిజెపి జాతీయ పార్టీ అని ఆయన అన్నారు. నీరు, చెట్టు పేరుతో కోటి మొక్కలు పెంచేశామని ప్రగల్భాలు పలుకుతున్నారని, ఇందులో కూడా వేల కోట్ల అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. 

పోలవరం విషయంలో వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని ఆయన అన్నారు. తమకు టీడీపీ, వైసీపీ రెండు కూడా సమానమేనని ఆయన అన్నారు. వైసీపీ నమ్మించి మోసం చేసిందని అన్నారు.