అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని స్పష్టం చేశారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నుంచి భారీ సంఖ్యలో ఈ వలసలు ఉంటాయన్నారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూరప్ ట్రిప్ నుంచి రాష్ట్రానికి వచ్చేసరికి ఏపీ ముఖచిత్రం మారిపోతుందన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు వారసత్వం, బానిసత్వాల నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. అందువల్లే చాలామంది టీడీపీ నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారన్నారు. 

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతోపాటు కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి కూడా వలసలు ఉన్నాయన్నారు విష్ణువర్థన్ రెడ్డి.