ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్‌పై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నానికి కౌంటరిచ్చారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. తాము విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్‌పై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడాలి నానికి కౌంటరిచ్చారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కొడాలి నాని వచ్చినా సరే, లేదంటే వైసీపీ పెద్దలు వచ్చినా తాను సిద్ధమని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 

బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చామని.. గుడివాడలో ఏం పూర్తయ్యాయని ఆయన ప్రశ్నించారు. 2010-2024 మధ్య సీఎం వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు తమ ఆస్తుల వ్యత్యాసం బహిర్గతం చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 2024లో ఏపీలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీకి అనుకూలమైన ఓటే లేదని.. అలాంటప్పుడు వ్యతిరేక ఓటు చీలిక అనేది రాదన్నారు. ప్రధాని మోడీతో స్నేహం కోసం వైసీపీ వెంపర్లాడుతోందని విష్ణువర్థన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఏపీలో తాగడానికి నీళ్లు లేవు కానీ.. మద్యం మాత్రం ఏరులై పారుతోందని దుయ్యబట్టారు. 

ALso Read: పకోడీ గాడు .. అలాంటోళ్లతో జాగ్రత్త, లేదంటే బీజేపీకి కర్ణాటక గతే : సునీల్ దియోధర్‌కు కొడాలి నాని కౌంటర్

కాగా.. తనపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. సునీల్ ఒక పకోడి అన్న ఆయన.. అతనిలాంటి పకోడీల వల్లే కర్ణాటకలో బీజేపీకి ఆ పరిస్ధితి వచ్చిందన్నారు. సునీల్ లాంటి వ్యక్తులు ఏపీకి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వున్న సునీల్ దియోధర్ లాంటి బీజేపీ నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఆయన కోరారు. 

అంతకుముందు కొడాలి నానిపై మండిపడ్డారు సునీల్ దియోధర్. బుధవారం గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు వారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను నాని క్యాసినో, క్యాబిరే డ్యాన్స్ లుగా మార్చేశారని సునీల్ దుయ్యబట్టారు. గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్న కొడాలి నాని.... జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా ప్రజలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకొస్తే కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామని సునీల్ దియోధర్ స్పష్టం చేశారు.