Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ నేతల వద్ద భారీగా బ్లాక్ మనీ.. ఏపీలో ఈడీ, ఐటీ దాడులు జరగవే : విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు

ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల వద్ద భారీగా నల్లధనం వుందని.. మరి రాష్ట్రంలో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదని ఆయన ప్రశ్నించారు. 

ap bjp leader vishnukumar raju sensational comments on ysrcp leaders
Author
First Published Dec 13, 2022, 3:09 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేనంత నల్లధనం ఏపీలో వుందన్నారు. నగదు ద్వారా మద్యం అమ్మకాలను చేయించి వైసీపీ నేతలు భారీగా నల్లధనాన్ని పోగేశారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఈ అక్రమ సంపాదనతోనే వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో రూ.40 కోట్లు ఖర్చు పెట్టేందుకు వైసీపీ నేతలు రెడీ అయిపోయారని ఆయన దుయ్యబట్టారు. ఆ డబ్బును చూసుకునే 175 సీట్లలో గెలుస్తామనే ధీమాతో ఉన్నారని.. ఏపీలో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై వుందన్నారు. హత్యలు చేసిన ఎమ్మెల్సీలను జగన్ ప్రభుత్వం కాపాడుతోందని విష్ణుకుమార్ ఆరోపించారు. 

అంతకుముందు గత నెలలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి గవర్నర్ లేఖ పంపాలని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. ఇంతవరకు రైతులను ఐడీ కార్డులు అడగని పోలీసులు ఇప్పుడెందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. తాడేపల్లి డైరెక్షన్‌లోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసిందని ఆరోపించారు. 

ALso Read:జనసేన, టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.. విష్ణు కుమార్ రాజు సంచలన కామెంట్స్..

అంతేకాకుండా ఏపీలో పొత్తులపై కూడా విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాన్ని తిప్పికొట్టాలంటే, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే.. జనసేన, టీడీపీ, బీజేపీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉండే 90 నుంచి 95 శాతం మంది ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. మూడు పార్టీలు కలిస్తేనే తప్ప వైసీపీ దుర్మార్గాలను తిప్పికొట్టలేమనేది వారి అభిప్రాయం అని చెప్పారు. అయితే తమ పార్టీ కేంద్ర నాయకత్వం పొత్తులపై డిసైడ్ చేస్తుందని.. రాష్ట్ర నాయకత్వం అమలు చేస్తుందని తెలిపారు. 

పొత్తులపై ఇతర బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన విష్ణుకుమార్ రాజు.. ఈ విషయం వారికి తెలియదా? అని ప్రశ్నించారు. అవసరమైతే ప్రజల ప్రయోజనాలు కోసం పార్టీలు సొంత ఏజెండాను తాత్కాలికంగానైనా పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏపీ కో-కన్వీనర్  సునీల్ ధియోధర్ చేసిన వ్యాఖ్యలకు విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు పూర్తి విరుద్దంగా ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios