ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ పార్టీపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఏపీలో పొత్తులపై కూడా విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ పార్టీపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి గవర్నర్ లేఖ పంపాలని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. ఇంతవరకు రైతులను ఐడీ కార్డులు అడగని పోలీసులు ఇప్పుడెందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. తాడేపల్లి డైరెక్షన్‌లోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసిందని ఆరోపించారు. 

అంతేకాకుండా ఏపీలో పొత్తులపై కూడా విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాన్ని తిప్పికొట్టాలంటే, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే.. జనసేన, టీడీపీ, బీజేపీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉండే 90 నుంచి 95 శాతం మంది ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. మూడు పార్టీలు కలిస్తేనే తప్ప వైసీపీ దుర్మార్గాలను తిప్పికొట్టలేమనేది వారి అభిప్రాయం అని చెప్పారు. అయితే తమ పార్టీ కేంద్ర నాయకత్వం పొత్తులపై డిసైడ్ చేస్తుందని.. రాష్ట్ర నాయకత్వం అమలు చేస్తుందని తెలిపారు. 

పొత్తులపై ఇతర బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన విష్ణుకుమార్ రాజు.. ఈ విషయం వారికి తెలియదా? అని ప్రశ్నించారు. అవసరమైతే ప్రజల ప్రయోజనాలు కోసం పార్టీలు సొంత ఏజెండాను తాత్కాలికంగానైనా పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏపీ కో-కన్వీనర్ సునీల్ ధియోధర్ చేసిన వ్యాఖ్యలకు విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు పూర్తి విరుద్దంగా ఉన్నాయి. 

సునీల్ ధియోధర్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టాన్ని చవిచూశామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. పవన్ కల్యాణ్ రోడ్ మ్యాప్ వ్యవహారాన్ని తాము అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు. రోడ్డు మ్యాప్‌పై మీడియాతో పవన్ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు. 

ఇదిలా ఉంటే.. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఏపీ బీజేపీలో చర్చకు దారితీశాయి. తాను రోడు మ్యాప్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని పవన్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. తనకు మోదీ, బీజేపీ అంటే గౌరవమని... అలాగని ఊడిగం చేయనని స్పష్టం చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కావడంతో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. అయితే పవన్ మాత్రం తాము ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. 

ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై కన్నా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. పార్టీలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ అగ్రనాయకత్వం దృష్టికి వెళ్లడంతో.. వారు కన్నాతో మాట్లాడారు. సమన్వయంతో ఉండాలని మీడియాతో ఇలాంటి విషయాలు మాట్లాడవద్దని సూచించారు. ఈ క్రమంలోనే స్పందించిన సోము వీర్రాజు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పార్టీ పెద్దలకు వివరించినట్టుగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో తాము కలిసి పోటీ చేస్తామని తెలిపారు. కన్నా లక్ష్మీ నారాయణ పెద్దలని చెప్పిన సోము వీర్రాజు.. ఆ విషయంలో తాను స్పందించనని చెప్పారు. 

మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏపీ కో-కన్వీనర్ సునీల్ ధియోధర్ స్పష్టం చేశారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టాన్ని చవిచూశామని చెప్పారు. ఢిల్లీలో సునీల్ ధియోధర్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. పవన్ కల్యాణ్ రోడ్ మ్యాప్ వ్యవహారాన్ని తాము అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు. రోడ్డు మ్యాప్‌పై మీడియాతో పవన్ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ పరిణామాలను గమనిస్తే.. ఏపీ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయని.. చాలా విషయాల్లో ఇరువర్గాల నేతలు భిన్నాభిప్రాయాలతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.