ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైరయ్యారు. అమరావతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో జగన్ కేంద్రాన్ని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరారని గుర్తుచేశారు. జగన్ కోరికలో ఎలాంటి తప్పు లేదని సోము స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదానే అయితే దానిని కేంద్రం పరిశీలిస్తుందని తెలిపారు.

కాగా.. ఇప్పటికే తమతో చాలా మంది టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని సోము బాంబు పేల్చారు. కేంద్రం పోలవరం నిర్మాణం కోసం రూ. 3,700 కోట్లు విడుదల చేసిన విషయాన్ని వీర్రాజు గుర్తు చేశారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌కు రూ.10,000 కోట్లు యుద్ధప్రాతిపదికన విడుదల చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని ఆయన వెల్లడించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగానే చూస్తుందన్నారు.

మరోవైపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం శాసనసభలో మాట్లాడిన సీఎం జగన్.. తనతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించగా.. ఇవాళ వీర్రాజు సైతం  ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు.