అమరావతి: ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీలు అప్పుడే ఎన్నికల సమరానికి రెడీ అవుతున్నాయి. అటు అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు జనసేన పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. 

అన్ని పార్టీలు చావో రేవో తేల్చుకునేందుకు రెడీ అవుతుంటే బీజేపీ మాత్రం భయంతో బిక్కుబిక్కు మంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బొక్క బోర్లా పడటంతో దాని ప్రభావం తమపై ఎక్కడ చూపుతుందోనని భయాందోళన చెందుతున్నారట. 

ఈ నేపథ్యంలో ఏపీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు కీలక నేతలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకులాట ప్రారంభించారట. ఏదొక పార్టీలో జంప్ అయిపోవాలని కర్చీఫ్ లు వేసి మరీ ప్లేస్ సిద్ధం చేసుకున్నారట. గోపీల్లా ఉన్న వాళ్లు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు గోడ దూకేందుకు రెడీ అవుతున్నారట. 

2014 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి వేరు...ప్రస్తుత పరిస్థితి వేరు. ఆనాడు పొత్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు బీజేపీకి ఊపిరిపోశారు. అదే చంద్రబాబు పొత్తుకు గుడ్ బై చెప్పి బీజేపీపై తిరుగుబాటుకు దిగారు. దీంతో ఆ పార్టీ ఉన్న ఊపిరి కూడా పోగెట్టేసే పనిలో పడ్డారు.  

అవకాశం దొరికితే చాలు చంద్రబాబు నాయుడు బీజేపీపై యుద్ధానికి రెడీ అవుతున్నారు. బీజేపీని అన్ని అంశాల్లో దోషిగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఏపీలో బీజేపీ పరిస్థితి దయనీయంగా మారింది. 

చంద్రబాబు అండ్ కో చేస్తున్న ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావులు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు పదేపదే బీజేపీపై విమర్శలు చెయ్యడం రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ చేస్తున్న ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లిపోయామని ఫలితంగా ప్రస్తుతం పార్టీ పరిస్థిత అంత బాగోలేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఇటీవల తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రభావం ఏపీలో జరిగే ఎన్నికలపై చూపుతాయా అంటూ బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో వేరువేరుగా ఎన్నికలు జరిగినా ఒకేసారి జరిగాయి. ఫలితంగా ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చెయ్యలేదు. 

కానీ ప్రస్తుతం పరిస్థితి వేరు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఆ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బొక్క బోర్లా పడింది. కేవలం ఒక్కస్థానానికే పరిమితమైంది. గత ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధిస్తే ఈసారి నాలుగింటిని కోల్పోయి కేవలం ఒక్కసీటుతో సరిపెట్టుకుంది. 

వాస్తవానికి తెలంగాణలో బీజేపీ కాస్త స్ట్రాంగ్ అనే చెప్పుకోవాలి. దీంతో తెలంగాణలో బీజేపీ తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు బరిలోకి దిగింది. 119 నియోజకవర్గాలకు గానూ 118 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసింది బీజేపీ.  

కానీ ఓటర్లు మాత్రం బీజేపీని తిరస్కరించారు. ఐదు స్థానాలకు అయినా పట్టం కడతారనుకున్న వారి అంఛనాలను తలకిందులు చేశారు. కేవలం ఒకే ఒక్కసీటుతో సరిపెట్టారు. ఇది ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. 

తెలంగాణలో అధికారంలోకి రాకపోయినా కొన్ని స్థానాలను గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషిస్తామని బీజేపీ ఆశలు పెట్టుకుంది. అందుకు వ్యూహాలు కూడా రచించింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు కేంద్రమంత్రులను బరిలోకి దింపింది. 

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం రంగంలోకి దింపింది. ఎంతమంది బరిలోకి దిగినా ఓటరు దేవుడు మాత్రం బీజేపిని దరిచేర్చుకోలేదు. 118 స్థానాల్లో పోటీ చేస్తే 105 చోట్ల డిపాజిట్‌ ను కోల్పోయింది బీజేపీ. 13 స్థానాల్లో మాత్రమే డిపాజిట్లు దక్కాయి.

తెలంగాణలో అంతో ఇంతో పట్టు ఉన్న బీజేపీ పరిస్థితి అలా ఉంటే ఏపీలో ఇంకెలా ఉంటుందోనని ఏపీ బీజేపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. తమ పార్టీని విలన్ లా చూస్తున్న ప్రజలు రాబోయే ఎన్నికల్లో తమను ఆదరిస్తారా కనీసం గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలనైనా తిరిగి ఇస్తారా అంటూ సందేహాన్ని వెలబుచ్చుతున్నారు. 

ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారట ఏపీ బీజేపీ నేతలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని ఆయా పార్టీలు బీజేపీని విలన్ గా చిత్రీకరించాయని మెురపెట్టుకున్నారట. ఫలితంగా ఏపీలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. 

బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఊహించినట్లుగానే బీజేపీ నేతలు గోడ దూకేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీమంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యబోనని తెగేసి చెప్పేశారు. అటు తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే మాజీమంత్రి మాణిక్యాలరావు రాజీనామా చేసేశారు. 

ఇకపోతే అసెంబ్లీలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు సైతం పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీల్లో ఆయన కర్చీఫ్ వేసినట్లు తెలుస్తోంది. ఏ పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీలోకి జంప్ అవుతారని సమాచారం.