విశాఖపట్నంకు చెందిన భాజపా శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు నోట్ల రద్దుపై తన అసంతృప్తిని బయటపెట్టారు.

ఇంత కాలం గుంభనంగా ఉన్న నేతల్లోని అసంతృప్తి కూడా బయటపడుతోంది. నోట్ల రద్దు నిర్ణయంపై భారతీయ జనతా పార్టీ నేతలు తమ అసహనాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేస్తారు? ప్రజల మనోభావాలను బట్టే కదా వాళ్లు కూడా నడుచుకోవాల్సింది.

నోట్ల రద్దైన దగ్గర నుండి ఇన్ని రోజులూ భాజపా నేతలు ఎక్కడా బహిరంగంగా బయటపడలేదు. పైగా టివి చర్చల్లో మోడి నిర్ణయాన్ని సమర్ధించలేక నానా అవస్తలు పడ్డారు. అయితే ఎంత భాజపా నేతలైనా ఊర్లలో తిరిగేటపుడు ప్రజాలకు ఏమని సమాధానం చెబుతారు? ప్రతిపక్షాల మీద నోరు చేసుకున్నట్లు ప్రజల మీద కూడా విరుచుకుపడితే మళ్లీ జనాల్లో తిరగలేరు.

ఇదంతా ఎందుకంటే, తాజాగా విశాఖపట్నంకు చెందిన భాజపా శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు నోట్ల రద్దుపై తన అసంతృప్తిని బయటపెట్టారు. నోట్ల రద్దుతో మొదట్లో తాను కూడా మంచి జరుగుతుందనుకున్నట్లు చెప్పారు. అయితే, నోట్ల రద్దుతో ప్రజలు సహనం కోల్పోతున్నట్లు చెప్పారు.

తాను కూడా సహనం కోల్పోతున్నట్లు తెలపటం గమనార్హం. రోజులు గడిచే కొద్దీ ప్రజల సమస్యలు పెరిగపోతుండటం పట్ల ఆందోళనగా ఉందన్నారు. మోడి నిర్ణయం మంచిదే అయినా అమల్లోనే లోపాలున్నట్లు అసహనం వ్యక్తం చేసారు.

ఇదిలావుండగా, మిత్రపక్షమైన టిడిపి నేతలు కూడా ఇప్పుడిప్పుడే మోడి నిర్ణయంపై విరుచుకుపడుతున్నారు. నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు, చిత్తూరు ఎంపి శివప్రసాద్ తదితరులు బాహాటంగానే మోడి నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.

ఇంకొద్ది రోజులు పోతే కలుగులో నుండి ఎలుకలు బయటకు వచ్చినట్లు ఇటు భాజపా అటు టిడిపి నేతలందరూ మోడి నిర్ణయాన్ని తప్పుపడుతూ బాహటంగానే విరుచుకుపడినా ఆశ్చర్యం లేదు.