Asianet News TeluguAsianet News Telugu

రూ. 2 వేల నోటు వల్ల వారికే నష్టం.. బ్రాందీ షాపుల్లో మార్చాలని చూస్తున్నారు : సోము వీర్రాజు వ్యాఖ్యలు

రూ.2 వేల నోటు ఉపసంహరించడం వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది వుండదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఈ దెబ్బతో ఆ డబ్బును దాచిన వారంతా బయటకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. 
 

ap bjp chief somu veerraju reacts on rbi withdraws rs 2000 notes ksp
Author
First Published May 21, 2023, 4:46 PM IST

రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంపై స్పందించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నోట్లు రద్దు నిర్ణయం సాహసోపేతమన్నారు. గత కొద్దిరోజులుగా రూ.2 వేల నోటు జాడలేదని.. ఈ దెబ్బతో ఆ డబ్బును దాచిన వారంతా బయటకు రావాల్సిందేనని సోము వీర్రాజు పేర్కొన్నారు. అవినీతిపై ప్రధాని నరేంద్ర మోడీ సమర శంఖారావం పూరించారని.. బ్రాందీ షాపుల ద్వారా రూ.2 వేల నోట్లు మార్పిస్తారనే ప్రచారం జరుగుతోందని ఆయన ఆరోపించారు. రూ.2 వేల నోటును బ్యాంక్‌లోనే మార్చాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. 

రూ.2 వేల నోటు రద్దు వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది వుండదని ఆయన స్పష్టం చేశారు. ఇక కొందరు ఉద్యోగ సంఘాల నాయకులపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరంతా రెగ్యులర్‌గా ఏవేవో ప్రకటనలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని సీఎం పరిపాలిస్తున్నారా లేక ఈ నాయకులే పాలిస్తున్నారా అంటూ సోము వీర్రాజు చురకలంటించారు. సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇవ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: మీ ద‌గ్గ‌రున్న రెండు వేల రూపాయ‌ల నోట్ల‌ను ఎలా మార్చుకోవాలంటే..?

కాగా.. రూ.2000 నోటును ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై దేశంలో మిశ్రమ స్పందన లభిస్తోంది. బీజేపీ , ఎన్డీయే నేతలు ఈ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తోండగా.. విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఎరగా వేసి ఓట్లు కొనుక్కుందామని అనుకుంటున్న పార్టీలకు రూ.2 వేల నోటు ఉపసంహరణతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. 

ఓటింగ్ శాతం పెరిగితేనే ప్రజాస్వామ్య పర్యవేక్షణ సాధ్యమన్న విష్ణుకుమార్ రాజు.. నల్లధనం పేరుకుపోయిన వారికి తప్పించి.. రూ.2 వేల నోటు ఉపసంహరణ వల్ల సామాన్యులకు ఎలాంటి నష్టం లేదన్నారు. పెద్ద నోట్ల కారణంగా ఏర్పడే సమస్యలను తాను గతంలోనే ఆర్బీఐకి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని ఆయన గుర్తుచేశారు. ఇక తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని విష్ణుకుమార్ రాజు ఖండించారు. పొత్తులపై హైకమాండ్‌దే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios