మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీని వీడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపాయి. వీటిపై సోము వీర్రాజు స్పందించారు.
తనపై కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. బాపట్ల జిల్లా చీరాలలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కన్నా లక్ష్మీనారాయణ తనపై చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తున్నారని గుర్తుచేశారు. వీటిపై గతంలోనూ తాను స్పందించలేదని, ఇప్పుడూ స్పందించాల్సిన అవసరం లేదని వీర్రాజు కుండబద్ధలు కొట్టారు. సాధారణ కార్యకర్తగా చేరిన తారు.. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి చేరానని ఆయన పేర్కొన్నారు. తానేంటో బీజేపీ అధిష్టానానికి తెలుసునని వీర్రాజు పేర్కొన్నారు. ఇక జనసేనతో పొత్తుపై ఆయన స్పందిస్తూ.. బీజేపీతోనే తాము పొత్తులో వున్నామని పవన్ కల్యాణ్ విజయవాడ పర్యటనలో చెప్పారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 60శాతం వరకు నిధులు కేంద్రమే కేటాయిస్తోందని కానీ జగన్ ప్రభుత్వం మాత్రం నిధులు తమవేనని చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గురువారం తన ముఖ్య అనుచరులు, శ్రేయాభిలాషులతో సంప్రదింపులు జరిపిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. అయితే తన భవిష్యత్తు కార్యచరణ ఏమిటనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన అనుచరులతో పూర్తి స్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయానికి ప్రకటించనున్నట్టుగా తెలిపారు.
రాష్ట్ర పార్టీ పనితీరు నచ్చకనే రాజీనామా..
బీజేపీకి రాజీనామా చేసిన సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు గౌరవం ఉందని.. అది ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పారు. బీజేపీలో చేరినప్పటికీ నుంచి పార్టీ అభివృద్ది కోసం కృషి చేశానని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అందరిని ఏకతాటిపై నడిపానని తెలిపారు. సోమువీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయిందని విమర్శించారు. సోమువీర్రాజు నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదన్నారు. సోమువీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆయన వైఖరి, వ్యవహారశైలి నచ్చకనే పార్టీని వీడుతున్నట్టుగా చెప్పారు. తన పాటు రాజీనామా చేసిన అనుచరులకు ధన్యవాదాలకు ధన్యవాదాలు తెలియజేశారు.
