హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా జనసేన, భారతీయ జనతా పార్టీ కలసికట్టుగా ముందుకు వెళ్తాయని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకొని ముందడుగు వేస్తామని తెలిపారు. 

శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు పవన్ అభినందించారు. ఈ సందర్భంగా అమరావతి, రాష్ట్ర ఆర్థిక స్థితి, కేంద్ర నిధులను రాష్ట్రంలో వ్యయం చేస్తున్న తీరు, వర్తమాన రాజకీయ స్థితిగతులు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... సోము వీర్రాజు బీజేపీ ఏపీ బిజెపి అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని అన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై కలిసి పని చేయడం గురించి మాట్లాడుకున్నామని... అమరావతిలోని రైతుల సమస్య, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నామని పవన్ తెలిపారు. 

''ఈ రోజు మా మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలపై మరింత కూలంకషంగా చర్చిస్తాం. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర సభ్యులు, బీజేపీ సభ్యులతో కలసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తాం'' అని పవన్ వెల్లడించారు. 

read more  బిజెపి-జనసేన మిత్రపక్షాల దూకుడు...పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజు భేటీ

ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ... ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికంగా బలపడేందుకు అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రమని అన్నారు. అన్ని వనరులూ, సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రమని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో జనసేన, బీజేపీ ఉన్నాయని పేర్కొన్నారు. 

''రాష్ట్రంలో ఉన్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాం. వాటికి కేంద్ర ఆలోచనలను మిళితం చేస్తూ ముందుకువెళతాం. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్న తీరును, నరేంద్ర మోడీ ఆలోచనలను పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రజల ముందుకు తీసుకువెళ్తాం. 2024నాటికి రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపుదిద్దేందుకు ఒక ప్రణాళిక తీసుకుంటాం'' అని అన్నారు. 

''అమరావతి విషయంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ రైతాంగానికి సంబంధించిన అంశాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారికి ఏ విధమైన సాయం చేయగల అవకాశం ఉందో ఆలోచన చేస్తాం. వారికి ఎలాంటి నష్టం లేని ఆలోచనను తెలియచేసే ప్రయత్నం చేస్తాం'' అని వీర్రాజు పేర్కొన్నారు.