రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద బీజేపీ మహానిరసనను చేపట్టింది. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహించింది.
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద బీజేపీ మహానిరసనను చేపట్టింది. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు దారిమళ్లించి సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించింది. ఈ నిరసనలకు వారి మిత్రపక్షమైన జనసేనకు కూడా బీజేపీ ఆహ్వానం పలికింది. గ్రామ పంచాయితీలకు కేంద్రం కేటాయించిన నిధుల దారి మళ్లింపుపై నిరసన తెలియజేసింది. ఒంగోలులో జరిగిన నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్‌ను తుంగలో తొక్కిందని, గ్రామాల్లోని ప్రజల అవసరాలను విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని మండిపడ్డారు. పంచాయితీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించారని.. నిధుల లేమి వల్ల గ్రామాల్లో అభివృద్ది పనులు జరగడం లేదని అన్నారు. గ్రామాల్లో సొంతంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కనీస వసతులు కల్పించిన సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. సొంత డబ్బులు పెట్టి సర్పంచులు పనులు చేస్తున్నారని.. బిల్లులు రాక వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని అన్నారు.
సర్పంచ్‌ల ఆత్మహత్యల పాపం సీఎం జగన్‌ది కాదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఏనాడైనా సర్పంచ్‌ల సమస్యలపై మాట్లాడారా? అని ప్రశ్నించారు.
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలపైనే జగన్ మాట్లాడుతున్నారని.. సర్పంచ్‌ల వ్యవస్థను అవమానపరుస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో పనుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లిస్తున్నారని విమర్శించారు. సర్పంచ్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదల చేసిన సుమారు రూ.8000 కోట్లను స్వాహా చేసిందని విమర్శించారు. అయితే సర్పంచ్‌లకు బీజేపీ మద్దతు ప్రకటించడంతో కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని ప్రకటించిందని.. అయితే పంచాయతీల నుంచి పెండింగ్‌లో ఉన్న కరెంటు ఛార్జీల పేరుతో ఆ రూ.1000 కోట్ల నుంచి రూ.600 కోట్లు కోత పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని.. అయితే ఆ హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు. రాష్ట్రంలో సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆమె ప్రకటించారు.
ఇదిలాఉంటే, విశాఖలో బీజేపీ నిర్వహించిన మహాధర్నాలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. పంచాయితీలకు కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుందని ఆరోపించారు. పంచాయితీ నిధుల్లోనూ జగన్ అవినీతికి పాల్పడటం సిగ్గుచేటని విమర్శించారు. సర్పంచులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. సర్పంచులు ఆందోళనకు దిగితే నిర్భంధిస్తున్నారని మండిపడ్డారు. సర్పంచుల న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
