అమరావతే ఏపీ రాజధాని అన్న పురందేశ్వరి.. ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం అభివృద్ది చేయాలని చూస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సాకారం అందడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఏపీకి కేంద్రం ఏం చేయడం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం అభివృద్ది చేయాలని చూస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సాకారం అందడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఏపీకి కేంద్రం ఏం చేయడం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి అత్యధిక ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. పురందేశ్వరి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల వాణిని వినిపించడమే తమ లక్ష్యమని అన్నారు. బీజేపీ అధిష్టానం చెప్పినట్టుగా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. పొత్తులపై అగ్రనాయకత్వం నిర్ణయిస్తుందని.. తమ ముందు పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉందని చెప్పారు. బీజేపీ అధిష్టానం అభిప్రాయమే పురందేశ్వరి అభిప్రాయమని తెలిపారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఇదివరకే తాను స్పందించడం జరిగిందని చెప్పారు. ఎన్టీఆర్ ప్రజల మనిషి.. ప్రజా దేవుడని అన్నారు. దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసిందని స్పష్టం చేశారు. తమకు అనుకూలమైనవారి పేర్లతో దొంగ ఓట్లు సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూడటం దుర్మార్గమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే బీజేపీ సంపూర్ణంగా కట్టుబడి ఉందని తెలిపారు.
ఏపీకి సుదీర్ఘ తీరప్రాంతం ఉందని.. ఇక్కడ నివసించే మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. సీఎం జగన్ పదే పదే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని వారిని సొంతం చేసుకునే భావనతో మాట్లాడుతున్నారని.. మరి వారికి ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. తాడేపల్లిలో సీఎం ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో ఎస్సీ మహిళపై అత్యాచారం జరిగితే.. ఆమెకు న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని అన్నారు.
అమరావతిలోని ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్లకు నిర్మాణం అనే అంశం కోర్టులో ఉందని చెప్పారు. తాము పేదలు, అమరావతి రైతుల ఇద్దరి పక్షమని చెప్పారు. పేదలకు ఇళ్లు ఇవ్వొద్దని తాము ఎక్కడ చెప్పలేదని అన్నారు. అక్కడ నిర్మాణమయ్యే ఇళ్లకు కూడా ప్రతి ఇంటికి రూ. 1.8 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని గమనించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని విమర్శించారు. బీజేపీలోకి రావాలని భావించినవారు.. తమ పార్టీ సిద్దాంతానికి కట్టుబడి ఎవరూ పార్టీలోకి వచ్చిన స్వాగతిస్తామని చెప్పారు.
వచ్చే నెల 10వ తేదీన సర్పంచ్‌ల సమస్యలపై బీజేపీ గళం విప్పుతుందని.. జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. సర్పంచ్‌లకు వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోందని విమర్శించారు.