దేశ భద్రత విషయంలో ప్రధాని మోడీ రాజీలేని పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విజయవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 2014లో దేశ ప్రధానిగా ఎన్నికైన మోడీ.. దేశ సేవకుడిగా పనిచేస్తానని చెప్పారని కన్నా గుర్తుచేశారు.

ఇచ్చిన మాట ప్రకారం దేశాన్ని అభివృద్ధి పరంగా  అన్ని రంగాలలో ముందంజలో నిలిపారని ఆయన కొనియాడారు. కాపలాదారునిగా ఉంటానని రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు.

Also Read:3 గంటల పాటు డ్యాన్స్, సుహారిక మరణానికి కారణం అదేనా: కీలకంగా పోస్ట్‌మార్టం నివేదిక

దేశంలో పెండింగ్‌లో ఉన్న త్రిబుల్ తలాక్, అయోధ్య, కాశ్మీర్ వంటి అంశాలలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శరణార్ధుల కోసం ప్రత్యేకంగా చట్టం‌ చేసి‌ భరోసా, భద్రత కల్పించారని మోడీ ప్రపంచవ్యాప్తంగా పేరు గడించడం ఓర్వలేక కాంగ్రెస్, కొన్ని ముస్లిం శక్తులు కుట్ర చేస్తున్నారని కన్నా ఆరోపించారు

మత విద్వేషాలు రెచ్చగొట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని.. కోవిడ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని సాధ్యమైనంత వరకు  వ్యాప్తి ని నిరోధించారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ చారిత్రక నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయన్నారు.

మోడీ ముందు చూపున్న ప్రధానిగా దేశ ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేసేందుకు చేపట్టిన చర్యలు అందరూ స్వాగతించారని కన్నా గుర్తుచేశారు. కరోనా వారియర్స్ గా ఉన్న వారిని గౌరవించి,  సన్మానించే సంప్రదాయానికి మోడీ శ్రీకారం చుట్టారని.. వారి కుటుంబాలకు భద్రత గా యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చారని ఆయన ప్రశంసించారు.

నేడు 1.60లక్షల మంది కి ఒక్కరోజు లో పరీక్షలు చేసేలా సామాగ్రి ని సమకూర్చారని.. 650 కోవిడ్ పరీక్ష కేంద్రాలను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేశారని లక్ష్మీనారాయణ కొనియాడారు. గరీభ్ కళ్యాణ్ యోజన్ కింద లక్షా 75వేల కోట్లు పేదలకు పంచారని, నగదు, బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు ఇచ్చారని ఆయన చెప్పారు.

Also Read:కన్నా చిన్నకోడలి అనుమానాస్పద మృతి: ఆత్మహత్య మాత్రం కాదంటున్న పోలీసులు

సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం నగదు ఆయన ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. సెకండ్ ప్యాకేజీ కింద ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా  ఇరవై లక్షల కోట్లు ప్రకటించారని.. దెబ్బ తిన్న ప్రతి సెక్టార్ కు చేయూతను ఇచ్చేలా ప్రోత్సాహకాలు ఇచ్చారని కన్నా అన్నారు.

వలస కార్మికుల  స్వస్థలాలకు పంపి.. నగదు కూడా కేటాయించారని లక్ష్మీనారాయణ చెప్పారు. గ్రామీణ స్థాయి లో రైతుల ఆదాయం పెరిగేలా‌ చేపట్టారని, అవినీతి లేని పాలన అందిస్తూ ప్రపంచంలో ఆదర్శవంతమైన నాయకునిగా మోడీ నిలిచారని కన్నా ప్రశంసించారు. ఏపీ ప్రజలు కూడా నాయకత్వాన్ని అర్ధం చేసుకుని ఆదరించాలని.. ముఖ్యమంత్రి ఏడాది పాలనపై రేపు స్పందిస్తానని లక్ష్మీనారాయణ స్ఫష్టం చేశారు.