చంద్రబాబు - పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ... పొత్తులపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఏపీలో పొత్తుపై బీజేపీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. పొత్తులపైనే ఆధారపడి కార్యక్రమాలు వుండవని, పార్టీ బలోపేతం చేయడం కోసం కృషి చేస్తామని పురందేశ్వరి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ వాతావరణ వేడెక్కింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోలోగా బరిలోకి దిగగా.. టీడీపీ , జనసేనలు మాత్రం పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీని కూడా ఈ కూటమిలోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఢిల్లీలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి బీజేపీ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పొత్తులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి సైతం స్పందించారు. ఏపీలో పొత్తుపై బీజేపీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. పరిస్థితులను బట్టి ముందుకు వెళ్తామని.. సమయానుకూలంగా నిర్ణయాలు వుంటాయని దగ్గుబాటి పేర్కొన్నారు. పొత్తులపైనే ఆధారపడి కార్యక్రమాలు వుండవని, పార్టీ బలోపేతం చేయడం కోసం కృషి చేస్తామని పురందేశ్వరి తెలిపారు. దేశంలో 2014కు ముందు కుంభకోణాలు జరిగేవని.. కానీ మోడీ ప్రధాని అయ్యాక ఇండియా రూపురేఖలే మారిపోయాయని ఆమె ప్రశంసించారు.
కాగా.. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న అమిత్ షా పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పొత్తులపై ఇప్పుడే ఏం చెప్పలేమని , కానీ ఎన్డీయేలోకి కొత్తమిత్రులు వస్తారంటూ సంకేతాలిచ్చారు. కుటుంబాలకే ఫ్యామిలీ ప్లానింగ్ కానీ రాజకీయాల్లో కూటమిలో ఎంతమంది సభ్యులుంటే అంత బలమని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఎన్డీయేలోని మిత్రులను తామెప్పుడూ బయటకు పంపలేదని, ఆయా రాష్ట్రాల్లోని సమీకరణాల వల్లే నిర్ణయాలుంటాయని కేంద్ర హోంమంత్రి అభిప్రాయపడ్డారు. పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్‌తోనూ చర్చలు జరుగుతాయని అమిత్ షా పేర్కొన్నారు.