రాష్ట్రంలో విద్యుత్ కోతలపై మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.  విద్యుత్ కోతలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లిపోయారని ఆమె చురకలంటించారు. రోజుకు 240 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమైతే, కేవలం 198 మిలియన్ మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో విద్యుత్ కోతలపై మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ కోతలపై రాష్ట్ర ప్రభుత్వం గందరగోళాన్ని సృష్టిస్తుందన్నారు. విద్యుత్ కోతలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లిపోయారని ఆమె చురకలంటించారు. కోతలు వుంటాయని ఒకసారి, వుండవని మరోసారి ప్రకటనలు చేస్తున్నారని పురందేశ్వరి దుయ్యబట్టారు. 

దీనిని బట్టి విద్యుత్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదనే విషయం అర్ధమవుతోందని.. గ్రామాల్లో తొమ్మిది గంటల పాటు విద్యుత్ ఇస్తామని చెప్పి జగన్ మోసం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో జనం కరెంట్ కోతలతో అల్లాడుతున్నారని.. విద్యుత్ శాఖ కార్యాలయాలను ముట్టడించే పరిస్ధితి నెలకొందని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. రోజుకు 240 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమైతే, కేవలం 198 మిలియన్ మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. 

ALso Read: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్

ఇకపోతే.. నిన్న పురందేశ్వరి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సనాతన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష ‘‘ఇండియా’’ కూటమిలోని నేతలు మాట్లాడుతున్నారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఉదయనిధికి మద్ధతుగా కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ఖండించారు. 

ఉదయనిధి మాట్లాడుతున్నప్పుడు అదే వేదికపై వున్న పీకే శేఖర్ బాబు అభ్యంతరం తెలపకపోవడం దేనికి సంకేతమని పురందేశ్వరి ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని విచ్ఛిన్న చేయడమే ఇండియా కూటమి ఉద్దేశమని కాంగ్రెస్ తమిళనాడు అధ్యక్షుడు పేర్కొన్నారని.. ఈ ఘటనలు దేశంలో హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని పురందేశ్వరి ట్వీట్ చేశారు. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడానికి కనీస నైతిక హక్కు లేదని.. గతంలో రాహుల్ గాంధీ హిందూ సంస్థలను లష్కరే తొయిబా సంస్థతో పోల్చిన విషయాన్ని పురందేశ్వరి గుర్తుచేశారు