సభలో వైసీపీకి టీడీపీ ట్విస్ట్: జగన్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు
ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ వైసీపీకి ట్విస్ట్ ఇచ్చింది. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో మార్షల్స్ పై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ సభ్యులు సభలో డిమాండ్ చేశారు.
చంద్రబాబు నాయుడు మార్షల్స్ ను బాస్టర్డ్ అన్నారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారని అలాగే మార్షల్స్ పై దాడికి సైతం దిగారని అందుకు వీడియోలను సైతం ప్రదర్శించారు.
చంద్రబాబు అండ్ టీంపై చర్యలు తీసుకోండి: మంత్రి బుగ్గన తీర్మానం.
ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఏకంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు అనని మాటలను అన్నారని ఆరోపిస్తూ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు వైసీపీ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇకపోతే తాను బాస్టర్డ్ అని మార్షల్స్ ను అనలేదని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.నో క్వశ్చన్, వాట్ నాన్సెన్స్ అనేటువంటి పదాలను మాత్రమే వాడానని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు.
టీడీపీ ఇచ్చినదానికి మీరెలా రూలింగ్ ఇస్తారు : శాసన మండలి చైర్మన్ పై బొత్స అసహనం...
గురువారం ఉదయం 8.55గంటలకు ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శాసన సభ ఆవరణలోకి వస్తున్న సమయంలో గేట్ నెం 4 వద్ద చీఫ్ మార్షల్ వచ్చి నిలిపివేశారని ఫిర్యాదు చేశారు.
గేట్ తెరవమని చీఫ్ మార్షలతో వాగ్వాదం జరిగిందని గేటు తెరవని విషయాన్ని అమర్యాదగా ప్రవర్తించిన విషయాన్ని అదే రోజున సభలో ప్రస్తావించి బాధ్యులపై చర్య తీసుకోమని తాము కోరినట్లు ప్రివిలేజ్ మోషన్ లో తెలిపారు.
అయితే అసెంబ్లీ గేటు వద్ద మార్షల్స్ తో వాగ్వాదం అంశంపై శుక్రవారం శాసన సభ ప్రారంభం నుంచే తమపై వైసీపీ నేతలు దూషణలకు దిగారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన పలువురు సభ్యులు ప్రతిపక్షనేత ఉద్యోగస్థులను దుర్భాషలాడినట్లు ఆరోపించడం జరిగిందన్నారు.
సీఎం జగన్ లేచి ఈ విషయమై ఈ వాగ్వాదంలో ప్రతిపక్ష నేత చీఫ్ మార్షలను ఉద్దేశించి బాస్టర్డ్ అని దుర్భాషలాడినట్లు ఆరోపించారని చెప్పుకొచ్చారు. అనంతరం దీనికి సంబంధించిన విడియో క్లిప్పింగ్ ను సభలో అనేక సార్లు ప్రదర్శించడం జరిగిందన్నారు.
ఎన్నిసార్లు విడియో ప్రదర్శించిన క్లిప్పింగ్ ను పరిశీలించగా ప్రతిపక్షనేత చంద్రబాబు తలుపు తీయి, నో క్వశ్చన్, అసెంబ్లీకి పోకూడదా, మర్యాదగా చెబుతున్నా, ఎవరు చెప్పారు నీకు, వదులు, యుఆర్ అ టు బి చీఫ్ మార్షల్ అన్న పదాలనే వాడినట్లు చెప్పుకొచ్చారు.
ఇదే అంశాన్ని ప్రస్తావించేందుకు సభలో ప్రతిపక్షనేత చంద్రబాబు సమయం అడగగా ఇవ్వలేదని ఆరోపించారు. అయితే సభ అభిప్రాయం తీసుకుని చర్య తీసుకునే అధికారం శాసనసభాపతికి కట్టబెట్టినట్లు తీర్మానం చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
అనని మాటను అన్నట్లుగా ప్రతిపక్ష నేతకు ఆపాదించి ఒక సభలో వాడకూడని పదాన్ని సీఎం జగన్ వాడటం ప్రతిపక్ష నేత యొక్క గౌరవభంగం కలిగేట్లు మాట్లాడం దుర్మార్గమైన విషయమన్నారు టీడీపీ నేతలు. ఈ విషయమై సభను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి జగన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రివిలేజ్ మోషన్ లో కోరారు.