కళింగుల ఆత్మీయ కలయిక.. స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన వ్యాఖ్యలు
కళింగ ఆత్మీయ కుటుంబ కలయిక కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కళింగులకు రిజర్వేషన్‌పై పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కళింగులు వచ్చే ఎన్నికల్లో తమకు ప్రాధాన్యతను ఇచ్చే పార్టీ వైపుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఆదివారం నిర్వహించిన కళింగ ఆత్మీయ కుటుంబ కలయిక కార్యక్రమానికి తమ్మినేని హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారామ్ మాట్లాడుతూ.. విశాఖ నార్త్ అసెంబ్లీ టికెట్‌ను కళింగులకు కేటాయించాలని , కానీ అలా జరగట్లేదన్నారు. కళింగులను తెలంగాణలో బీసీ- ఏ జాబితా నుంచి తొలగించడంపై కేసీఆర్‌తో మాట్లాడానని చెప్పారు. కళింగులకు రిజర్వేషన్‌పై పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కళింగులకు ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లను జగన్ కేటాయించారని తమ్మినేని సీతారామ్ చెప్పారు.
ఇకపోతే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు తమ్మినేని. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని.. ఆయన మీటింగ్ పెడితే జనాలు చనిపోతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ సైకిల్ గుర్తు కాదు.. పీనుగు గుర్తు పెట్టుకోవాలని తమ్మినేని సీతారామ్ సెటైర్లు వేశారు. టీడీపీ హయాంలో పింఛను కోసం అధికారులు, పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తమ్మినేని పేర్కొన్నారు.
అంతకుముందు కొద్దిరోజుల క్రితం తొడకొట్టి సంచలనం సృష్టించారు స్పీకర్ . ఏపీలో మరోసారి వైఎస్ జగన్ సీఎం అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జలో నిర్వహించిన వలంటీర్ల సమావేశంలో సీతారాం తొడకొట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయం సాధిస్తుందని మహిళలే భరోసా ఇస్తున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో వెళ్తున్న జగన్ పై ప్రజల్లో విశ్వాసం వెల్లివిరుస్తుందని స్పీకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.