Asianet News TeluguAsianet News Telugu

వరుసగా నాలుగో రోజు: ఏపీ అసెంబ్లీ నుండి 15 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుండి మంగళవారం నాడు టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. 

AP Assembly Speaker Tammineni Sitaram Suspended 15 TDP MLAs from house
Author
First Published Sep 20, 2022, 12:40 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి మంగళవారం నాడు టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. వరుసగా నాలుగు రోజులుగా టీడీపీ సభ్యులు సభ నుండి సస్పెండౌతున్నారు.ఈ నెల 15వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  ప్రతి రోజూ ఏదో ఒక అంశంపై టీడీపీ సబ్యులు నిరసనకు దిగుతున్నారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేస్తున్నారు.

ఈ నెల 15న పాలనా వికేంద్రీకరణపై చర్చ సమయంలో రాజధాని భూముల అంశంపై టీడీపీ పై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పయ్యావుల కేశవ్ కోరారు. కేశవ్ కు మద్దతుగా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో  సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ నెల 16వ తేదీన తామిచ్చిన వాయిదా తీర్మానంపై టీడీపీ పట్టుబట్టింది.  దీంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ నెల 19వ తేదీన వ్యవసాయంపై టీడీపీ సభ్యులు తమ వాయిదా తీర్మానంపై పట్టుబట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని  సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో టీడీపీ సభ్యులను నిన్న ఒక్క రోజు పాటు సస్పెండ్ చేశారు.  ఇవాళ కూడ సభా కార్యకలాపాలకు అంతరాయం కల్గిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నుండి టీడీపీకి చెందిన  బెందాళం ఆశోక్, కింజారపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు,అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయులును సభ నుండి సస్పెండ్ చేశారు.

also read:చంద్రబాబు సర్కార్ డేటా చోరీ: పెగాసెస్ పై మధ్యంతర నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన భూమన

రేపటి తో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో అసెంబ్లీ పని చేసింది. ఈ నెల 17, 18 తేదీలు అసెంబ్లీకి సెలవు ఇచ్చారు.ఈ నెల 19వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios