అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సీఎం ఆదేశాలకు అనుగుణంగానే నుడుచుకొంటున్నారని   మాజీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఏపీ అసెంబ్లీలో సీఎం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం విషయమై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం సాగింది. ఈ సమయంలోనే మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగించారు.  ఏపీకి ప్రత్యేక హోదాకు తాము ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు. చంద్రబాబు ప్రసంగం పూర్తైన తర్వాత ఏపీ సీఎం జగన్ గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్నారు.

గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చలో పాల్గొంటూ అంతకు ముందే చంద్రబాబు నాయుడు ప్రస్తావించిన అంశాలను జగన్ ప్రస్తావించారు. టీడీపీ తీరును ఎండగట్టారు. చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను పట్టించుకోలేదన్నారు.

ఈ సమయంలో చంద్రబాబునాయుడు తాను మాట్లాడేందుకు ప్రయత్నించారు. చంద్రబాబునాయుడు మాట్లాడుతానని అనగానే.. జగన్ కూర్చొన్నారు. ఆ సమయంలో చంద్రబాబునాయుడు లేచి సీఎం చెబితేనే తనకు మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు.

సభను సీఎం నడిపిస్తున్నారని.. సీఎం ఆదేశాలకు అనుగుణంగానే స్పీకర్ నడుచుకొంటున్నారని  చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తాను ఈ సభలో అందరి కంటే చాలా సీనియర్‌నని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం తాను కేంద్రంపై ఏ రకంగా పోరాటం చేశానని వివరించారు. ప్రత్యేక హోదా కోసం  సాధించాలని  వైసీపీకి సూచించారు. తాము అండగా ఉంటామన్నారు.