చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకు రారు : ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు . టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకు రారని వ్యాఖ్యానించారు . జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి.. ఆయనను 16 నెలలు జైల్లో వేశారని.. ఏం తేల్చగలిగారు, సీబీఐనే చేతులు ఎత్తేసిందని సీతారాం గుర్తుచేశారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకు రారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తలకు, నేతలకు బాధగా వున్నప్పటికీ.. చంద్రబాబుపై చాలా కేసులలో స్టేలు వున్నాయని సీతారామ్ వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంకి సంబంధించి చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారని.. ఆయన మొదటి నుంచి స్కాంల వ్యక్తేనని స్పీకర్ వ్యాఖ్యానించారు.
జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి.. ఆయనను 16 నెలలు జైల్లో వేశారని.. ఏం తేల్చగలిగారు, సీబీఐనే చేతులు ఎత్తేసిందని సీతారాం గుర్తుచేశారు. నారా భువనేశ్వరి అన్నట్లుగా నిజమే గెలవాలని.. స్టేలు వెకేట్ చేసుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు. నిజమే గెలిస్తే చంద్రబాబు జీవితకాలం జైల్లో వుండాలని స్పీకర్ తమ్మినేని అన్నారు. చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబుపై వన్ బై వన్ కేసులు వున్నాయని.. ఆయనను జగన్ ప్రభుత్వం ఏం చేయలేదని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీబీఐ, ఈడీ, జీఎస్టీ, సెబీ లాంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని తమ్మినేని సీతారామ్ తెలిపారు.
ALso Read: చంద్రబాబుపై నా వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించింది.. గోరంట్ల మాధవ్
మరోవైపు.. చంద్రబాబు నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. పద దోషంతోనే చంద్రబాబుపై ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశమని గోరంట్ల మాధవ్ తెలిపారు. తాను అన్న వ్యాఖ్యలను మరో కోణంలో అర్థం చేసుకోవడం వల్లే టీడీపీ వాళ్లకు తప్పుగా కనిపిస్తున్నాయని అన్నారు. తన వ్యాఖ్యలను టీడీపీ నేతలు వక్రీకరించారని చెప్పారు.
ఇటీవల, వైసీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా హిందూరం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో జగన్ సీఎం అవుతారని, చంద్రబాబు చస్తారని.. ఇది గ్యారంటీ అని అన్నారు. గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర కలకలం రేపింది. గోరంట్ల వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. చంద్రబాబును అంతమొందించేందుకు వైసీపీ ప్రణాళికలు రూపొందించారని చెప్పడానికి ఎంపీ వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ నేతలు మండిపడ్డారు. అయితే తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.