అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. 14 రోజులపాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. దాదాపు 21 బిల్లులను వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టగా 20 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 

పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం, మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు, విద్యాశాఖ ప్రక్షాళనకు సంబంధించి విద్యాబిల్లుకు సైతం ఆమోద ముద్ర వేసింది. 

అలాగే కాగ్ నివేదికను సైతం చివరి రోజైన మంగళవారం ప్రవేశపెట్టింది. కాగ్ నివేదికలో గత ఏడాది అప్పులు ఎక్కువగా ఉన్నాయంటూ స్పష్టం చేసిన విషయాన్ని వైసీపీ సభలో ఆరోపించింది. 

మరోవైపు ఇదే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత మరో నలుగురు టీడీపీ శాసన సభ్యులు సైతం సస్పెన్షన్ కు గురయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సస్పెన్షన్ వేటు పడటం ఇదే మెుదటి సారి.