హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై సభలో రగడ చోటు చేసుకుంది. టీడీపీ విమర్శలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సభ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా సవరణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సభ్యులు అక్రమాలకు పాల్పడితే తొలగించే అవకాశం ఉండేలా సవరణ చేసినట్లు ఆయన చెప్పారు. 

ప్రభుత్వ తీరుకు నిరసనగా టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.  రైతుల సమస్యలపై చర్చ జరగాల్సిందేనని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. రైతు సమస్యలపై టీడీపీ వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. 

పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. బిల్లుపై ఇంతకు ముందే చర్చ జరిగిందని, ఇక్కడి నుంచి శాసన మండలికి కూడా బిల్లు పంపించారని జగన్ చెప్పారు వినూత్నమైన పద్ధతిలో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు తెచ్చినట్లు ఆయన తెలిపారు. వ్యవస్థలో మార్పు తేవాలనే ఆరాటంతో బిల్లును తెచ్చినట్లు సీఎం తెలిపారు.