భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే: నిమ్మగడ్డకు కాకాని హెచ్చరిక
భారీ మూల్యం చెల్లించుకోవడానికి ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్దంగా ఉండాలని ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.
నెల్లూరు: భారీ మూల్యం చెల్లించుకోవడానికి ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్దంగా ఉండాలని ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.ఆదివారం నాడు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గృహ నిర్బంధం ఆదేశాలను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
క్షణం కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పదవిలో ఉండడానికి అర్హత లేదన్నారు. గవర్నర్ వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే పదవవి నుండి భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అసెంబ్లీ, ప్రివిలేజ్ కమిటీ నిర్ణయాలను కోర్టులో కూడ ఛాలెంజ్ చేయలేరని ఆయన చెప్పారు. ఎస్ఈసీ కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు.
ఎస్ఈసీ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారన్నారు. నిమ్మగడ్డ నిర్ణయాలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదును ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చర్చించింది. ఈ విషయమై మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.