ఎంతసేపూ తన గురించి, తన సౌకర్యాల గురించి మాత్రమే స్పీకర్ ఆలోచిస్తూ తమ విషయాలను గాలికి వదిలేసారంటూ ఉద్యోగులందరూ కోడెలపై చాలా కాలంగా మండిపోతున్నారు.

స్పీకర్ కోడెల శివప్రసాదరావును సమస్యలు ఒక్క సారిగా చుట్టుముడుతున్నాయి. జాతీయ విమెన్ పార్లమెంట్ నిర్వహణ సందర్భంగా తెలెత్తిన సమస్యలు ఇంకా సమసిపోకమునుపే అసెంబ్లీ ఉద్యోగుల సమస్యలు మొదలవుతున్నాయి. స్పీకర్ గా కోడెల బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి అసెంబ్లీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒక్కదాన్నీ పరిష్కరించలేదు. ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి హామీలిస్తూ కాలాన్ని నెట్టుకొనుస్తున్నారు. ఈ విషయంలో ఉద్యోగులందరూ మండిపోతున్నారు.

తాజాగా అసెంబ్లీ మొత్తాన్ని హైదరాబాద్ నుండి వెలగపూడికి తరలించాలని నిర్ణయించటంతో ఉద్యోగుల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అసెంబ్లీ సిబ్బందిలో తెలంగాణా స్ధానికత కలిగిన వారు 124 మంది ఉన్నారు. వారంతా తాము వెలగపూడికి వచ్చేది లేదంటూ భీష్మించుకున్నారు. దానికితోడు ఉద్యోగులను బలవంతంగా తరలిస్తున్నారు కానీ వెలగపూడి అసెంబ్లీ భవనంలో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులకు అవకాశాలే లేవు. ఉద్యోగులకు ప్రత్యేకంగా ఛాంబర్లు ఏర్పాటు కాలేదు. అసలు ఇక్కడి నుండి తరలిస్తున్న సరంజామాను సర్దటానికి కొత్త అసెంబ్లీ భవనంలో అవకాశమే లేదు. ఈనెల 20 ప్రాంతంలో హైదరాబాద్ నుండి మొత్తం సరంజామాను వెలగపూడికి తరలించి ఎక్కడ పెడతారో కూడా అర్ధం కావటం లేదు.

ఎంతసేపూ తన గురించి, తన సౌకర్యాల గురించి మాత్రమే స్పీకర్ ఆలోచిస్తూ తమ విషయాలను గాలికి వదిలేసారంటూ ఉద్యోగులందరూ కోడెలపై చాలా కాలంగా మండిపోతున్నారు. ఏళ్ళ తరబడి ప్రమోషన్లు లేదని కొందరు, స్ధానికత ఆధారంగా తమను తెలంగాణాకు కేటాయించలేదని మరికొందరు, ఖాళీలను భర్తీచేయకపోవటంతో పనిభారం పెరిగిపోతోందని మరికొందరు ఇలా..ఎవరి సమస్యలతో వారు కోడెలపై గుర్రుగా ఉన్నారు. ఇన్ని సమస్యలపైన తాజాగా వెలగపూడికి తెరలిస్తుండటంతో ఉద్యోగులు మండిపోతున్నారు. తమ సమస్యలను తక్షణమే తీర్చకపోతే స్పీకర్ వ్యవహారశైలికి వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమానికి యోచిస్తున్నారు.