అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరాలు తెగే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మెుదలైంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఓటర్లు ఏ పార్టీవైపు మెుగ్గు చూపారు, ఎవరికి పట్టం కట్టారనే ఉత్కంఠ నెలకొంది. 

మరోవైపు ఎన్నికల్లో ఏ పార్టీ బోణీ కొట్టబోతుందన్న ఉత్కంఠ కూడా నెలకొంది. ఈసారి ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం తొలి ఫలితం వెలువడనుందని తెలుస్తోంది. 13 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోనుందని సమాచారం. 

ఇకపోతే ఆఖరి ఫలితం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 18 రౌండ్ల అనంతరం రంపచోడవరం ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే రాజమహేంద్రవరం రూరల్ కూడా 18వ రౌండ్లో ఆఖరి ఫలితం వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.