అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. జులై 10 నుంచి బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ బడ్జెట్ సమావేశాలను 25 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

జూలై 10 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో జులై 12న నూతన  ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.  

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఏఏ శాఖకు ఎంతెంత నిధుల కేటాయిస్తారన్న దానిపై, ఏ రంగానికి పెద్ద పీట వేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ జగన్ ఇచ్చిన నవరత్నాలు పథకాలతోపాటు ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిధుల కేటాయింపు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.