జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై చర్చకు పట్టుబడుతూ అసెంబ్లీలో నిరసనకు దిగిన టిడిపి సభ్యులపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సీరియస్ అయ్యారు. 

అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యేలు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై చర్చకు పట్టుబట్టడంతో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly)లో గందరగోళ పరిస్థితి నెలకొంది. చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతించకపోవడంతో పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ, పేపర్లను చించి స్పీకర్ పై విసురుతూ నిరసన చేపట్టారు టిడిపి సభ్యులు. ఇలా టిడిపి సభ్యులు అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు (kurasala kannababu) మండిపడ్డారు. 

''శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్‌గా మారింది. శవాలు పట్టుకుని రాజకీయం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కించపర్చాలని కుట్ర చేస్తున్నారు. ఇంటింటికీ బెల్ట్‌ షాప్‌లు, పర్మిట్‌ రూమ్‌లు పెట్టి ఆనాడు దారుణంగా మద్యం అమ్మకాలు కొనసాగించారు. నాడు ఎన్టీఆర్‌ మద్య నిషేధం అమలు చేస్తే...చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్యం కంపెనీలతో కుమ్మక్కై ఆ మద్య నిషేధానికి తూట్లు పొడిచారు. ఇవాళ కూడా సిగ్గు, శరం లేకుండా వ్యవహరిస్తున్నారు. అనైతికంగా ప్రవర్తిస్తున్నారు'' అని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

''వైసిపి ప్రభుత్వంపై బురదజల్లేలా అసత్య కధనాలను ఎల్లో మీడియాలో రాస్తున్నారు. వాటిని పట్టుకుని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా సభలో గందరగోళం సృష్టిస్తున్న టిడిపి సభ్యులను వెంటనే సస్పెండ్ చేయాలి'' అని కన్నబాబు స్పీకర్ ను కోరారు. 

మరో మంత్రి కొడాలి నాని (kodali nani) కూడా అసెంబ్లీలో టిడిపి సభ్యుల తీరును తప్పుబట్టాడు. ఆనాడు ఎన్టీఆర్‌ మద్య నిషేధం అమలు చేస్తే దానికి ఇదే చంద్రబాబు తూట్లు పొడిచానరని మండిపడ్డారు. తన పాలనలో ఇష్టారాజ్యంగా బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ లతో మద్యం అమ్మకాలను మరింత ప్రోత్సహించారని ఆరోపించారు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేయించి, మద్యం అమ్మకాలు పెంచిన చంద్రబాబు అంతులేని అవినీతికి పాల్పడ్డాడడని మంత్రి నాని ఆరోపించారు. 

''ఎల్లో మీడియా, ఈనాడు జంగారెడ్డిగూడెం ఘటనను తప్పుదారి పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా కధనం రాసింది. చివరకు ఈనాడు అధినేత రామోజీరావు ఆ స్థాయికి దిగజారాడు. చంద్రబాబు శవ రాజకీయం చేస్తున్నాడు. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలి'' అని నాని కూడా స్పీకర్ ను కోరారు. 

వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ (jogi ramesh) టీడీపీ సభ్యులపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారని...అందులో భాగంగానే జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. సభ నుండి సస్పెండ్ కావాలని టీడీపీ సభ్యులు ఆరాటపడుతున్నారని జోగి రమేష్ అన్నారు. 

ఇక రాష్ట్రంలో ఎనీ టైమ్ మందు దొరికేలా చంద్రబాబు పాలన సాగిందని మరో వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఎన్టీఆర్ నుండి అధికారాన్ని లాక్కుని మద్య నిషేధాన్ని ఎత్తివేసిన చంద్రబాబు రాష్ట్రంలో మద్యం ఏరులై పారించారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చిందో లేదో కానీ మద్యం మాత్రం ఇచ్చిందని రోజా ఎద్దేవా చేసారు. 

చంద్రబాబు పాలనలో బడి,గుడి అనే తేడా లేకుండా మద్యం దుకాణాలు తెరిచారని రోజా విమర్శించారు. టీడీపీ హయంలో 40 వేల బెల్ట్ షాపులకు అనుమతిచ్చారన్నారని... అలాంటిది చంద్రబాబు మద్యపాన నిషేధం గురించి టీడీపీ సభ్యులు మాట్లాడితే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని రోజా చెప్పారు.