అమరావతి: నివర్ తుఫాను ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై విరుచుకుపడి అతలాకుతలం చేసి విషయం తెలిసిందే. ఈ గండం నుండి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న ఈ రాష్ట్రాలను మరో రెండు తుఫాన్ల ముప్పు వెంటాడుతోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం డిసెంబర్ 2న బురేవి, 5న టకేటి తుఫాన్ల రూపంలో ఈ రెండు రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని తెలుస్తోంది. 

ఇప్పటికు నివర్ తుఫాను దాటికి తీవ్రంగా నష్టపోయిన ఇరు రాష్ట్రాల రైతాంగానికిమరో రెండు తుఫాన్లు విరుచుకుపడనున్నాయన్న వార్త తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.  నివర్ కారణంగా భారీ వర్షాలు కురియడంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి తీర ప్రాంతాలను ముంచెత్తాయి. మరో రెండు తుఫాన్ల ప్రభావంతో ఇదే స్థాయిలో వర్షాలు కురిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తకు సిద్దమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలా డిసెంబర్ 2న 'బురేవి తుఫాన్' తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపారు. మరీ ముఖ్యంగా ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఇక డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి' తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 7న దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంద అంచనా వేస్తున్నారు.