ఏపీలో టీడీపీ - జనసేన కూటమికే ఎడ్జ్ , కంచుకోటలో వైసీపీకి ఎదురుగాలేనట .. తెలంగాణలో నిజమైన ఈ సంస్థ సర్వే

ఏపీలో అధికారం ఎవరిది ..? అంటూ పలు వార్తాసంస్థలు, ఏజెన్సీలు ముందస్తు సర్వేలు చేపడుతున్నాయి .  రైజ్ సంస్థ సర్వేలో మాత్రం టీడీపీ, జనసేన కూటమిదే అధికారమని అంచనా వేసింది. జగన్ పార్టీకి కంచుకోట వంటి రాయలసీమలో ఈసారి ఫ్యాన్‌కు ఎదురుగాలి తప్పదని సర్వే పేర్కొంది. 

another sensational survey on ap assembly elections 2024 ksp

ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనితో పాటే సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగుతాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందరికంటే ముందే అభ్యర్ధుల ప్రకటన, ప్రచారం మొదలుపెట్టారు. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటిస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లని చెబుతోన్న జగన్.. ప్రజల్లో వ్యతిరేకత వున్న నేతలను నిర్మోహమాటంగా పక్కనపెట్టేస్తున్నారు. ఆత్మీయులు, సన్నిహితులు, బంధువులు ఎవరైనా సరే లెక్క చేసేది లేదంటూ దూసుకెళ్తున్నారు. 

అటు ప్రతిపక్షం కూడా ఎన్నికలపై సీరియస్‌గానే దృష్టి పెట్టింది. టీడీపీ, జనసేన పొత్తు కన్ఫర్మ్ కాగా.. సీట్ల పంపకాల దిశగా చంద్రబాబు, పవన్‌లు చర్చలు జరుపుతున్నారు. రేపో మాపో అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్‌లు బీజేపీని కూటమిలోకి చేర్చేందుకు చివరి ప్రయత్నంగా ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ వస్తే సరే.. లేకుంటే తమ రెండు పార్టీలే బరిలో నిలవాలని వీరిద్దరూ దాదాపు డిసైడ్ అయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచారం, ఎన్నికల వ్యూహాలు కూడా ఆ వెంటనే ఖరారు చేసి.. మార్చి తొలి వారం నుంచి ప్రచార బరిలో దిగాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. 

ఇదిలావుండగా.. ఏపీలో అధికారం ఎవరిది ..? అంటూ పలు వార్తాసంస్థలు, ఏజెన్సీలు ముందస్తు సర్వేలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన చాలా సర్వేల్లో వైసీపీదే మరోసారి అధికారమని తేలగా.. తాజాగా రైజ్ సంస్థ సర్వేలో మాత్రం టీడీపీ, జనసేన కూటమిదే అధికారమని అంచనా వేసింది. కర్నాటక, తెలంగాణల్లో ఈ సంస్థ చెప్పిన విధంగానే ఫలితాలు రావడంతో తాజా సర్వే ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

రైజ్ సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి 94, వైసీపీకి 46 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని 35 చోట్ల హోరాహోరీ పోరు వుండొచ్చని పేర్కొంది. అంతేకాదు.. జగన్‌కు కంచుకోట లాంటి రాయలసీమలో ఈసారి వైసీపీకి ఎదురుగాలి తప్పదని సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో సీమలోని మొత్తం 52 స్థానాలకు గాను మూడు తప్పించి మిగతావన్నీ ఫ్యాన్ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. నెల్లూరు జిల్లా అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం ఒక్క కడప మినహా మిగిలిన సీమ జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు తప్పవని రైజ్ వెల్లడించింది. 

ఇకపోతే.. రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకునే ఉమ్మడి కృష్ణా, గుంటూరుతో పాటు ప్రకాశం జిల్లాల్లో వైసీపీకి ఎదురుగాలి తప్పదని సర్వే తెలిపింది. అమరావతిపై నిర్లక్ష్యం, మూడు రాజధానుల వ్యవహారం ఇక్కడ ప్రభావం చూపే అవకాశం వుందని అభిప్రాయపడింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోనూ కూటమి బాగా పుంజుకుంటుందని తెలిపింది. జగన్ సోదరి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రభావం వుంటుందని , రెడ్డి సామాజిక వర్గం సైతం జగన్‌కు అండగా నిలబడే అవకాశాలు లేదని పేర్కొంది. ఈ పరిణామాలు నెల్లూరు, రాయలసీమలో జగన్ విజయావకాశాలను దెబ్బతీసే పరిస్ధితి వుందని రైజ్ అంచనా వేసింది. 

మరోవైపు.. టీడీపీ , జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడితే ఎలాంటి పరిస్ధితులు వుంటాయనే దానిపై పలువురు విశ్లేషకులు అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. బీజేపీపై ఏపీ ప్రజల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో విశ్వాసం లేదని, ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళితే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు వున్నాయని చెబుతున్నారు. బీజేపీ కనుక ఈ కూటమితో జత కలిస్తే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ ఓట్లు దూరమవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేవలం టీడీపీ, జనసేనలనే పరిగణనలోనికి తీసుకుని రైజ్ ఈ సర్వే చేసి వుండొచ్చని భావిస్తున్నారు.  ప్రస్తుతం ప్రజల మూడ్‌ను బట్టి ఈ ఫలితాలు వచ్చినప్పటికీ.. అభ్యర్ధుల తుది జాబితాలు వచ్చిన తర్వాత ఇందుకు భిన్నంగా రిజల్ట్ వుంటే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటి వరకైతే టీడీపీ జనసేన కూటమి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని రైజ్ సర్వే చెబుతోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios