కరోనా చెన్నైని వణికిస్తోంది. వరుసగా స్టార్ హోటళ్లు క్లస్టర్లుగా మారుతున్నాయి. తాజాగా  తమిళనాడులోని చెన్నైలో మరో స్టార్ హోటల్ కరోనా క్లస్టర్ గా మారింది. నగరంలోని ఒక ప్రముఖ హోటల్ లో మొత్తం 20 మంది సిబ్బంది వైరస్ బారిన పడినట్టు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇటీవల ఐటీసీ గ్రాండ్ చోళాలో కోవిడ్ కలకలం సృష్టించగా తాజాగా లీలా ప్యాలెస్ హోటల్ మరో క్లస్టర్ గా మారడం ఆందోళన కలిగిస్తోంది.

శనివారం 85మంది ఐటీసీ హోటల్ లో సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగువాళ్లు కొవిడ్ బారిన పడిన ఘటన కలకలం రేపింది. వైద్యశాఖ జారీ చేసిన కోవిడ్ నిబంధనలు అనుసరిస్తున్నామని, దీనికి అదనంగా శుభ్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్టు హోటల్ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని అన్ని హోటళ్లలో శాచ్యురేషన్ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. 

ఈ క్రమంలో సోమవారం లీలా ప్యాలెస్ లో 232 మంది సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 10 శాతం మందిలో వైరస్ ఉన్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. చెన్నై లోని పలు హోటళ్లలో దాదాపు 6416 మంది విధులు నిర్వహిస్తుండగా వారిలో 4392మందికి పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు.

మొత్తంగా 3 శాతం సిబ్బందికి పాజిటివ్ గా నిర్థారణ అయినట్టు పేర్కొన్నారు. మరో 491మంది నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. దీంతోపాటు హోటల్ లో జరిగే అన్ని కార్యక్రమాలను నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. 

చెన్నైలో ఇది మూడో హై ప్రొఫైల్ కొవిడ్ క్లస్టర్ గా మారింది. డిసెంబర్ మధ్యలో ఐఐటీ - మద్రాస్ లో కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఒక వారం సమయంలోనే ఈ క్యాంపస్ లో దాదాపు 100 మందికిపైగా విద్యార్థులు కొవిడ్ బారిన పడడంతో తాత్కాలికంగా మూసేశారు.