వేధింపులకు మరో ఇంజనీరింగ్ విద్యార్దిని నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పాణ్యంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్ధిని ఉషారాణి మరణానికి కారకులెవరు? ఇపుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తుతో ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన విద్యార్దిని అర్ధాంతరంగా తునువు చాలించటానికి కారకులెవరన్నది పలువురిని వేధిస్తున్న ప్రశ్న. కళాశాలలోని పరిస్దితులను నిశితంగా పరిశీలిస్తే అధ్యాపకుడు, కళాశాల యాజమాన్యం, తోటి విద్యార్దినులు..ఇలా అందరూ కారకులేనన్న సమాధానం వినిపిస్తోంది.

 

చదువు చెప్పి ఉత్తమ విద్యార్దులను సమాజానికి అందించాల్సిన అధ్యాపకుడు, చదువుల్లో సహకరించుకోవాల్సిన రూమ్మేట్స్ చేసిన నమ్మక ద్రోహం, ఫిర్యాదు వచ్చినా చర్యలు తీసుకోకుండా ఉపేక్షించిన యాజమాన్యం కలిపి ఒక విద్యార్దిని గురువారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నది.

 

చదువు చెప్పాల్సిన అధ్యాపకుడు తనను రోజు వేధిస్తున్నట్లు మృతురాలు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపణలు వినబడుతున్నాయి.   అదే విధంగా హాస్టల్లోని తన రూమ్మేట్స్ కూడా నమ్మక ద్రోహం చేసి అధ్యాపకునితో కుమ్మక్కవటంతో తట్టుకోలేక న్యాయం జరగదని అర్దం చేసుకున్న ఉషారాణి చివరకు బలవన్మరణానికి పాల్పడింది.         

 

రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధినుల బలవన్మరణం ఇదే మొదటి సారి కాదు. ర్యాగింగ్ కావచ్చు, చదువుల్లో ఒత్తిడి కావచ్చు, ఫీజుల కోసం కళాశాలల యాజమాన్యం ఒత్తిళ్ళు కవచ్చు. కారణం ఏదైనా గానీ  సమిధలవుతున్నది మాత్రం విద్యార్దినులే.

 

విద్యార్ధినుల బలన్మరణానలు ఆగకపోవటానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కనబడుతోంది. ఎక్కడైనా కళాశాలలో విద్యార్దిని ఆత్మహత్య చేసుకోగానే వెంటనే విచారణ కమిటి వేయటం చేతులు దులిపేసుకోవటంతో బాధ్యత తీరిపోయిందని అనుకోవటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గడచిన రెండున్నరేళ్లుగా పలువురు విద్యార్దినులు, విద్యార్దులు ఆత్మహత్య ఘటనల్లో ఇంత వరకూ ఎన్ని విచారణ కమిటీలు వేసినా బాధ్యుల్లో ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోలేకపోవటం గమనార్హం.