విజయవాడలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. సదరు విద్యార్ధి తాను చదువుకునే కాలేజీలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల గదిలోనే ఉరేసుకుని దారుణానికి పాల్పడ్డాడు. అయితే అతడు ఆత్మహత్యకు పాల్పడింది ఓ కార్పోరేట్ కళాశాలలో కావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

విజయవాడ గురునానక్‌ కాలనీలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో కృష్ణా జిల్లాలోని మొగల్రాజుపురం కు చెందిన  నితీన్ కుమార్ ఇంటర్మీడియట్ ఫస్టీయర్ చదువుతున్నాడు. అయితే రోజూ మాదిరిగానే ఇవాళ కాలేజీకి వెళ్లిన ఇతడు ఏమైందో ఏమో గాని కాలేజీలోని ఓ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేసుతోంది.

ఇవాళ ఉదయం మయూరీ కాంప్లెక్స్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఇతడు తన ఆత్మహత్యకు ముందు ఓ సూసైడ్ లెటర్ కూడా రాసినట్లు తెలుస్తోంది. ఇందులో తనకోసం బాధపడవద్దని, అమ్మను, చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని తండ్రికి  లేఖ రాశాడు. ఈ ఆత్మహత్యకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అయితే ఈ మధ్య కార్పోరేట్ స్కూళ్లు, కాలేజీలలో చదువల ఒత్తిడితో, ఫీజుల వేధింపులతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో తాజా ఆత్మహత్య అలాంటిదేనా అని పలువురు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.