Asianet News TeluguAsianet News Telugu

అన్న క్యాంటీన్‌లో తింటే మీకు రూ.5లక్షలు ఆదాయం

గతంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లు జనాదరణ పొందాయి. గడిచిన ఐదేళ్లు నిలిచిపోయిన ఈ పథకం త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన దస్త్రంపై చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతకం చేశారు. ఈ క్యాంటీన్లలో భోజనం చేసే పేదలకు ఏడాదికి ఎంత ఆదా అవుతుందో తెలుసా...?  

Anna canteens food special story GVR
Author
First Published Jun 28, 2024, 10:17 AM IST

నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పనిచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఏర్పడ్డ చంద్రబాబు ప్రభుత్వం... ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ రాజధాని అమరావతి సహా అనేక ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టింది. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య వేలాది ఎకరాలు సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం... రాజధాని  నిర్మాణానికి పునాదులు వేసింది. 

అలాగే, పేదలకు మేలు చేసే చంద్రన్న కానుక, అన్నా క్యాంటీన్‌ లాంటి పథకాలను ఐదేళ్ల పాటు (2014-19) నిర్వహించింది చంద్రబాబు ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ల ద్వారా నిత్యం వేలాది మంది పేదలకు, రోజువారీ కూలీల ఆకలి తీర్చింది. విజయవాడ, గుంటూరు, విశాఖ, నెల్లూరు, తిరుపతి సహా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పేదలను అన్న క్యాంటీన్లు ఆదుకున్నాయి.

అయితే, 2019లో టీడీపీకి ఊహించని షాక్‌ తగిలింది. ఆ ఏడాది ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన పథకాలకు మంగళం పాడింది. ఆఖరుకు పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను కూడా తొలగించింది. కొన్నిచోట్ల అయితే, ఏకంగా అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కొద్దిపాటి భవనాలను కూడా ధ్వంసం చేశారు. దాంతో గడిచిన ఐదేళ్లపాటు పేదలు, దినసరి కూలీలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఓ రకంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను తొలగించి.. పేదల ఆగ్రహానికి గురైంది. ఇలా వెనుకా ముందు ఆలోచించకుండా జగన్‌ గతంలో చేసిన తప్పులే వైసీపీకి శాపాలయ్యాయి. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యేలా చేశాయి. 

ఇటీవల ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటు స్థానాలను పెద్ద సంఖ్యలో గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ 16 పార్లమెంటు స్థానాల్లో గెలిచింది. దీంతో రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో చంద్రబాబు కీలకమయ్యారు. కేవలం 240 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీకి చంద్రబాబు కూటమి సాధించిన పార్లమెంటు స్థానాలు కీలకమయ్యాయి. 

ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి అయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టడంతోనే దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అమరావతే రాజధాని అని ప్రకటించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకు కేబినెట్‌లో పచ్చజెండా ఊపారు. అలాగే గత ప్రభుత్వంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి ప్రాజెక్టులతో పాటు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే వంద రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 203 అన్న క్యాంటీన్లను సెప్టెంబర్ 21వ తేదీ నాటికి తిరిగి ప్రారంభించాలన్న ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా.. గతంలో నిర్మాణం పూర్తయి చిన్నచిన్న రిపేర్లు ఉన్న 183 క్యాంటీన్ల భవనాల మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు పూర్తి కావాల్సిన మరో 20 క్యాంటీన్ భవనాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయడంతో పాటు ఆహారం సరఫరా చేసేందుకు అవసరమైన సర్వీస్ ప్రొవైడర్‌ను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ కోసం కమిటీ నియమించాలని సూచించారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. 

Anna canteens food special story GVR

అయితే, అన్న క్యాంటీన్లపై ప్రజల్లోనూ సానుకూల స్పందన లభిస్తోంది. మూడు పూటలా (ఉదయం టిఫిన్‌, మధ్యాహ్న భోజనం, సాయంత్రం భోజనం) ఐదేసి రూపాయలకు భోజనం అందించే కార్యక్రమం ప్రారంభం కానుండటంపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ‘‘ఇంటికి వచ్చే పథకాలు వద్దు రోడ్డు మీద అడుక్కు తింటాం..’’ ‘‘లక్షలాది రూపాయలు అకౌంట్స్‌లో పడితే ఏవగింపు వచ్చింది. కంచంలో నాలుగు మెతుకులు వేస్తే అదే గొప్ప అనిపించింది’’ అంటూ టీడీపీ వ్యతిరేక వర్గాలు కామెంట్లు మొదలుపెట్టాయి. ఇలాంటి వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు కూడా దీటుగా బదులిస్తున్నాయి. 

ఈ క్రమంలో అన్న క్యాంటీన్లపై ‘ఏసియానెట్’ రాసిన కథనంపై స్పందించిన ఓ నెటిజన్... వైసీపీకి దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చాడు. ‘‘పథకాలు అందుకోవడమంటే అడుక్కు తినడమేనా..? ఒకరోజు భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? మూడు పూటలా హోటల్‌ తిన్నా, ఇంట్లో వండుకున్నా కనీసం రూ.200 ఖర్చు అవుతుంది. అంటే నెలకు రూ.6వేలు, సంవత్సరానికి రూ.72వేలు. ఇప్పుడు చెప్పండి.. ఏ పథకం గొప్పదో.. ఏడాదికి రూ.10వేలు ఎకౌంట్‌లో వేసే పథకం గొప్పదా..?'' అంటూ సదరు నెటిజన్‌ కామెంట్‌ చేయడం గమనార్హం. నిజమే కదా. ఇలా ఎందుకు ఆలోచించకూడదంటూ ఆ కామెంట్‌పై పలువురు సానుకూలంగానూ స్పందించారు.

ఆ నెటిజన్‌ చెప్పినట్లు.. రోజుకు రూ.200 చొప్పున ఖర్చయితే, నెలకు రూ.6వేలు, ఏడాదికి రూ.72వేలు అవుతుంది. అలా ఐదేళ్లకు రూ.3.60 లక్షలు ఖర్చవుతుంది. అన్న క్యాంటీన్‌లో అన్నం తింటే ఆ మొత్తం ఆదా అయినట్లే. ప్రతి నెలా ఆదా అయ్యే రూ.6000కి కనీసం 8శాతం వడ్డీ కలిపితే.. ఐదేళ్లలో ఆదా అయ్యే మొత్తం రూ.5లక్షలు దాటుతుంది. అన్న క్యాంటీన్లలో భోజనం చేసే నిరుపేద, రోజువారీ కూలీలు ఐదేళ్లలో రూ.5లక్షలు ఆదాయం సంపాదించడమంటే మామూలు విషయం కాదు. అలాగే, ఏటికేడు పెరిగే ధరలతో పోల్చి చూస్తే... పేదలకు మరింత ఆదా అయినట్లే. అంటే మూడుపూటలా అందరినీ అన్న క్యాటీన్లలోనే తినమని చెప్పడం కాదు కానీ.. వేరే అవకాశం లేని, వందల రూపాయలు భోజనానికి ఖర్చు చేయలేని వారిని దృష్టిపెట్టుకొని ఆలోచిస్తే అన్న క్యాంటీన్లనేవి నిజంగా పేదల పాలిటి పెన్నిధులే.

లెక్కలివిగో.... 
చంద్రబాబు ప్రభుత్వం గతంలో రూ.5కే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్‌ అమలు కావడంతో వేలాది మంది సద్వినియోగం చేసుకున్నారు. కూడళ్లలో మూడు పూటలా రూ.5కే ఆహారం అందించిన తక్కువ కాలంలోనే పేదలకు దగ్గరయింది. అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థకు అప్పగించిన గత చంద్రబాబు ప్రభుత్వం... పేదలకు రూ.ఐదేసి రూపాయలకు పూట భోజనం అందించింది. మూడు పూటలా ఆహారం అందించేందుకు రోజుకు రూ.73 చొప్పున ఇస్కాన్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మూడు పూటలా తిన్నవారు రూ.15 రూపాయలు చెల్లించగా... మిగిలిన రూ.58 రాయితీగా ప్రభుత్వమే భరించింది. 

ఇలా రోజుకి 2.25 లక్షల మంది అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ హయాంలో మొత్తం 4 కోట్లు 60 లక్షల 31 వేల 600 ప్లేట్ల భోజనాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా పంపిణీ చేశారు. తొలుత మున్సిపల్ ప్రాంతాల్లో ప్రారంభమైన అన్నా క్యాంటీన్లకు తక్కువ కాలంలోనే ప్రజాదరణ దక్కడంతో గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయి. అలా గ్రామీణ ప్రాంతాలకు కూడా 150 అన్న క్యాంటీన్లను ముంజూరు చేసింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. త్వరలోనే అవి తిరిగి ప్రారంభం కానుండటంతో పేదల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 

తెలంగాణలోనూ రూ.5 భోజనం...
అన్నపూర్ణ భోజన పథకం పేరుతో తెలంగాణలోనూ రూ.5కే భోజనం అందించారు. హైదరాబాద్‌ నగర ప్రజలకు నామమాత్రపు ఖర్చుతో ఆహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పథకం ద్వారా 2014 నుంచి 2022 మే నెల వరకు రూ.185.89 కోట్లు ఖర్చుతో రూ.9.67కోట్లకుపైగా భోజనాలను అందించారు. హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హ‌రేకృష్ణ మూమెంట్ ఛారిట‌బుల్ ఫౌండేష‌న్ సహకారంతో 2014 మార్చి 1న నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ఈ పథకం ప్రారంభమైంది. మొదట ప్రయోగాత్మకంగా 8 కేంద్రాల‌తో రోజుకు 2,500 మందికి భోజ‌నాన్ని అందించారు. ఆ తర్వాత ద‌శ‌ల‌వారీగా న‌గ‌రంలోని పలు ప్రాంతాల్లో విస్తరించి... దాదాపు 150 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రోజుకు 45వేల అన్నపూర్ణ భోజనాలను అందించారు. అలా, జూలై 2022 నాటికి 373 కేంద్రాల ద్వారా రోజుకు దాదాపుగా 80వేల మందికి రెండుపూటలా భోజనం అందించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios