అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో గత చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అంగీకారం వల్లనే కేంద్రం ఇప్పుడు కొర్రీలు పెడుతోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. 

టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు,. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, ప్రాజెక్టును తామే నిర్మిస్తామని గత చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన విషయానికి కేంద్రం అంగీకారం తెలిపిందని, స్వప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును తాము నిర్మిస్తామని చంద్రబాబు కోరారని ఆయన అన్నారు. 

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎవరు తప్పు చేశారో ప్రజలకు తెలియాలని అన్నారు. 2013-14 అంచనాల ప్రకారమే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిందని,  2016-17లో 20 వేల కోట్ల ప్రతిపాదనలకు టీడీపీ ప్రభుత్వం అంగీకరించిందని, అప్పటి టీడీపీ వైఖరే ఇప్పుడు శాపంగా మారిందని ఆయన అన్నారు. 

టీడీపీ తప్పులు చేస్తే తాము క్షమాపణలు చెప్పాలా అని ఆయన అడిగారు. తప్పులు చేశారు కాబట్టే చంద్రబాబు హైదరాబాదులో దాక్కున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ బండారం బయటపెడుతామని అనిల్ అన్నారు. ప్యాకెజీ కోసమే చంద్రబాబు పోలవరం బాధ్యత తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ప్రస్తుత అంచనాలతో పోలవరం నిర్మించడానికి తాము సిద్ధం లేమని ఆయన చెప్పారు.