వేతనాల పెంపుతో పాటు మరికొన్ని డిమాండ్ల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్ లోని అంగన్వాడీ వర్కర్స్ సమ్మెబాట పట్టారు. ఇవాళ్టికి వారి సమ్మె 16 రోజులకు చేరుకుంది.
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు సమ్మెను మరింత ఉదృతం చేసారు. నిన్న(మంగళవారం) మంత్రుల బృందంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ(బుధవారం) ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి చేపట్టారు అంగన్వాడీలు. దీంతో పలువురు ఎమ్మెల్యేల ఇళ్లవద్దకు అంగన్వాడీలు చేరుకుని ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, అంగన్వాడీల మధ్య వాగ్వివాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. ఎమ్మెల్యే బయటకు రావాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కానీ పోలీస్ వలయాన్ని దాటుకుని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందుకు వెళ్లి బైఠాయించిన అంగన్వాడీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

ఇక విజయవాడ ధర్నా చౌక్ లో ఇవాళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకేసారి అంగన్వాడీలతో పాటు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు ధర్నాకు దిగడంతో గందరగోళం నెలకొంది. ఎవరికి వారు వేరువేరుగా శిబిరాలు ఏర్పాటుచేసుకుని ధర్నా చేపట్టారు. దీంతో ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు.
మంత్రుల బృందంతో చర్చలు విఫలం కావడంతో ఇవాళ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడిని అంగన్వాడీ సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం ధర్నా చౌక్ నుండి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. శిబిరం నుండి బయటకు వెళ్లనివ్వకుండా నిర్బంధించేందుకు పోలీసులు ప్రయత్నించారు.దీంతో అంగన్వాడీలకు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది.
నిన్న రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన మంత్రుల బృందం అంగన్వాడీ కార్యకర్తలు,సహాకుల సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యింది. ఇందులో ప్రధానంగా వేతన పెంపు,గ్రాట్యుటీ అమలుపై మంత్రుల బృందం స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయింది... కానీ అంగన్వాడీ సంఘాల నాయకులు మాత్రం దీనపైనే పట్టుబట్టాయి. దీంతో ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని... సంక్రాంతి వరకు ఆగాలని మంత్రి బొత్స కోరారు. అందుకు అంగన్వాడీ సంఘాల నాయకులు అంగీకరించకపోవడంతో ఇవాళ సమ్మె యధావిధిగా కొనసాగుతోంది.
వేతన పెంపుపై సంక్రాంతి వరకు ఆగాలన్న మంత్రుల బృందం విజ్ఞప్తిపై అంగన్వాడీ ఉద్యోగసంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. కేవలం దాటవేసేందుకే ఇలాంటి మాటలు చెబుతున్నారని... సంక్రాంతికి ఏమైనా బంగారు గనులు ప్రభుత్వానికి వస్తాయా? అంటూ అంగన్వాడీలు ఎద్దేవా చేస్తున్నారు.
