బుజ్జగించి వారి ఏడ్పు మాన్పించాల్సింది పోయి.. ఓ అంగన్ వాడీ కార్యకర్త కర్కశంగా ప్రవర్తించింది. ఏడుస్తున్నాడని చెప్పి.. నోట్లో కారం కొట్టింది. 

పిల్లలు అన్నాక ఏడ్వటం సర్వసాధారణం. బుజ్జగించి వారి ఏడ్పు మాన్పించాల్సింది పోయి.. ఓ అంగన్ వాడీ కార్యకర్త కర్కశంగా ప్రవర్తించింది. ఏడుస్తున్నాడని చెప్పి.. నోట్లో కారం కొట్టింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా దపారుపూడి మండలం భూషణగుళ్ల గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..సోమవారం ఫణీంద్ర అనే మూడేళ్ల బాలుడిని తల్లి నాగమణి అంగన్వాడి కేంద్రంలో దించడానికి తీసుకెళుతుండగా తాను రానంటూ ఏడుపు మొదలుపెట్టాడు. అయినా నాగమణి చిన్నారిని బుజ్జగించి కేంద్రంలో వదిలి వెళ్లింది. 

ఫణీంద్ర ఎంతసేపటికీ ఏడుపు అపకపోవడంతో ఆగ్రహించిన ఆయా కుమారి చిన్నారి వేలికి కారం పూసి నోట్లో పెట్టిందని.. దీంతో బాలుడు మరింత బిగ్గరగా ఏడవడంతో బయటకు వినిపించకుండా నోరు మూసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

స్థానికులు, తల్లిదండ్రులు అంగన్వాడి కేంద్రానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆయా కుమారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయాపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన విరమించారు.